Chicken And Mutton : మనలో మాంసాహారాన్ని ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. మన రుచికి తగినట్టు చేపలు, రొయ్యలు, చికెన్, మటన్ వంటి వాటిని తింటూ ఉంటాం. మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు ఎన్నో లభిస్తాయి. అయితే ఈ మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకునే వారు కూడా ఉన్నారు. అసలు మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవచ్చా.. ఇలా తీసుకోవడం మనకు లాభమా..నష్టమా.. అసలు ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అతి సర్వత్రా వర్జయేత్ అనే సామెతను మనలో చాలా మంది వినే ఉంటారు. మాంసాహార విషయంలో కూడా ఈ సామెత సరిగ్గా సరిపోతుంది.
మాంసాహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి మేలు జరిగినప్పటికి దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వివిధ రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు కూడా ఈ మాంసాహారాన్ని ఎక్కువగా ఇవ్వకూడదట. పిల్లలకు మాంసాహారాన్ని ఎక్కువగా ఇవ్వడం వల్ల యుక్త వయసులోనే వృద్ధాప్య ఛాయలు వస్తాయట. అలాగే మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందట. అతిగా మాంసం తినడం వల్ల క్యాన్సర్ తో కాలేయ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. మాంసాహారాన్ని తీసుకున్నప్పటికి అందులో ఎక్కువగా కొవ్వు లేకుండా చూసుకోవాలి. మన శరీరానికి అవసరమయ్యే కొవ్వు కంటే మోతాదు మించకుండా చూసుకోవాలి.
మనం తీసుకునే ఏ మాంసాహారంలోనైనా ప్రోటీన్లు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. మటన్, రెడ్ మీట్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో బరువు పెరగడంతో పాటు హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చికెన్, చేపలను రోజూ తీసుకోవచ్చు. అయితే వీటిని కూడా మితంగా తీసుకోవాలి. రోజుకు 50 నుండి 100 గ్రాముల మోతాదులో ఈ చికెన్ ను, చేపలను ఆహారంగా తీసుకోవచ్చు. ఒక మటన్ ను మాత్రం వారానికి ఒక్కసారి తీసుకుంటేనే మన శరీరానికి మేలు కలుగుతుంది. మూత్రపిండాల సమస్యలతో, గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు వైద్యున్ని సంప్రదించి ఈ మాంసాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
అదే విధంగా ఎటువంటి మాంసాన్ని తీసుకున్నప్పటికి దానిని పూర్తి స్థాయిలో ఉడికించి తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు సరిగ్గా ఉడకని మాంసాన్ని తీసుకోవడం వల్ల అది గర్భస్థ శిశువు మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందట. అలాగే పిల్లల్లో అంధత్వం వచ్చే అవకాశం కూడా ఉంది. ఉడికించని చికెన్ ను తీసుకోవడం వల్ల పక్షవాతం బారిన పడే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాంసాన్ని చక్కగా ఉడికించి తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మాత్రమే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.