ప్రయాణంలో ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు, రన్నింగ్ చేస్తున్నప్పుడు… ఇలా ఏ సందర్భంలోనైనా తలకు దెబ్బ తాకితే అప్పుడు ఏం చేయాలో మీకు తెలుసా..? సాధారణంగా అలాంటి సందర్భాల్లో గాయం తీవ్రత ఎక్కువ ఉంటే దగ్గర్లో ఉండే ఎవరైనా ఆంబులెన్స్ కోసం కాల్ చేస్తారు. అయితే ఆంబులెన్స్ వచ్చే లోపు బాధిత వ్యక్తి దగ్గర ఉండే సహాయకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తలకు గాయమైన వ్యక్తి హార్ట్ రేట్‌ను చెక్ చేయాలి. అతను శ్వాస పీల్చుకుంటున్నాడో లేదో చూడాలి. శ్వాస అందకపోతే సీపీఆర్ చేయాలి. అంటే ఛాతిపై ఒత్తుతూ నోట్లో నోరు పెట్టి శ్వాస అందించాలి.
ఒక వేళ గాయపడిన వ్యక్తి శ్వాస పీల్చుకుంటూనే ఉండి అపస్మారక స్థితిలోకి వెళ్లాడంటే అప్పుడు అతని వెన్నెముకకు కూడా దెబ్బ తగలిందని తెలుసుకోవాలి. వెంటనే ఆ వ్యక్తిని నేలపై నిటారుగా పడుకోబెట్టి తలను, వెన్నెముకను ఒకే పొజిషన్‌లో ఉండేలా చూడాలి. చేతులను శరీరం పక్కనే ఉంచాలి. తలకు గాయమై తీవ్రంగా రక్త స్రావం అవుతుంటే దానిపై చేయి పెట్టి గట్టిగా అదిమిపట్టాలి. అలా 15 నిమిషాల పాటు ఉన్నాక దానిపై శుభ్రమైన గుడ్డతో కట్టు కట్టాలి. గాయం తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుని వద్దకు వెళ్లాలి. తలకు గట్టి దెబ్బ తగిలి పుర్రె ఎముక పగిలిందని అనుకుంటే అప్పుడు ఆ భాగంలో గట్టిగా అదమరాదు. గాయం నుంచి రక్తస్రావం ఆగేందుకు చేతిని అడ్డుపెట్టాలి. లేదా స్టెరిల్ గేజ్ వాడాలి.
తలకు గాయమైన వ్యక్తి వాంతులు చేసుకుంటూ ఉంటే అతన్ని వెల్లకిలా పడుకోబెట్టి కేవలం తలను మాత్రమే ఒక పక్కకు తిప్పాలి. తలకు గాయమయ్యాక ఆ ప్రదేశంలో వాపులు ఉంటే ఐస్ ప్యాక్ పెట్టాలి. దీంతో చాలా వరకు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తలకు గాయమై రక్తం కారుతుంటే దాన్ని నీటితో కడగరాదు. గాయంలో ఏది ఇరుక్కున్నా దాన్ని వెంటనే తీసేయరాదు. అలా చేస్తే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. గాయమైన వ్యక్తిని వీలైనంత వరకు కదిలించకుండా ఉండాలి. హెల్మెట్ పెట్టుకుని ఉన్న వ్యక్తి తలకు గాయమైతే చికిత్స అందేవరకు హెల్మెట్ తీయకూడదు. తలకు చిన్న గాయం అయినా, పెద్దగా తగిలినా గాయం అయ్యాక 48 గంటల వరకు మద్యం సేవించరాదు.
తలకు దెబ్బ తగిలితే కొన్ని లక్షణాలు మనకు తెలుస్తాయి. అవేమిటంటే… శరీరం మబ్బుగా అనిపిస్తుంది. బద్దకంగా ఉంటుంది. ఆందోళన, కంగారు వంటివి వస్తాయి. తల నొప్పి తరచూ వస్తుంది. వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు ఉంటాయి. గాయం అయిన ప్రదేశంలో ఎక్కువ రోజుల పాటు వాపు ఉంటుంది. నడిచేప్పుడు తూలుతారు. అయితే తలకు గాయం పెద్దగా అవకుండా చిన్నగా అయినా కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. ఎందుకంటే ఒక్కోసారి గాయం అయినప్పుడు మనకు ఎలాంటి లక్షణాలు తెలియవు. ఆ తరువాత అవి క్రమంగా పెరిగి మనల్ని ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టి వేసేందుకు అవకాశం ఉంటుంది. కనుక తలకు దెబ్బ తగిలితే అస్సలు నిర్లక్ష్యం చేయరాదు.