Kidneys : మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఇవి నిరంతరం పని చేస్తూనే ఉంటాయి. మన శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను, మలినాలను, విష పదార్థాలను తొలగించడంలో మూత్రపిండాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యంపైనే మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. కారణాలేవైనప్పటికి ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యకు తగిన చికిత్స తీసుకోకపోతే మూత్రపిండాలు వైఫల్యం చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే చాలా మందికి మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నాయన్న విషయాన్ని ముందుగా గుర్తించలేకపోతున్నారు. దీంతో సమస్య మరింత తీవ్రతరం అయ్యి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మన శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలను బట్టి మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నాయని మనం ముందుగానే గుర్తించవచ్చు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. మూత్రపిండాల్లో రాళ్ల కారణంగా మనలో కనిపించే లక్షణాలు ఏమిటి… అన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఊబకాయం, షుగర్ వ్యాధితో బాధపడే వారిలో మూతరపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కనుక ఈ సమస్యలతో బాధపడే వారు తరచూ మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే వీపులో, కడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి భరించలేనంతగా ఉంటుంది. అలాగే ఈ నొప్పి ఉన్నట్టుండి మొదలవుతుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే మూత్రంలో రక్తం వస్తుంది. మూత్రం పింక్ రంగులో లేదా గోధుమ రంగులో ఉంటుంది. అలాగే మూత్ర విసర్జన చేసినప్పుడు మూత్రం దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఇది కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఉండడం వల్ల కనిపించే లక్షణాల్లో ఒకటి. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఉండడం వల్ల తల తిరిగినట్టు ఉండడం, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలాగే తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.