Jeedipappu Payasam : మనం చాలా సులభంగా తయారు చేసుకోగలిగిన తీపి వంటకాల్లో పాయసం ఒకటి. మనం రకరకాల రుచుల్లో ఈ పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాం. డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన జీడిపప్పుతో కూడా మనం పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. జీడిపప్పుతో చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా తక్కువ సమయంలో మనం దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే జీడిపప్పు పాయసాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జీడిపప్పు పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదం పప్పు – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 4టేబుల్ స్పూన్స్, పిస్తా పప్పు – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఎండుద్రాక్ష – ఒక టేబుల్ స్పూన్, పాలు – అర లీటర్, పంచదార – 100 గ్రా., కండెన్స్డ్ మిల్క్ – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
జీడిపప్పు పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత జార్ లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక మరో రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. పాలు ఒక పొంగు వచ్చిన తరువాత ఇందులో పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని పది నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కండెన్స్డ్ మిల్క్, యాలకుల పొడి వేసి కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత ముందుగా వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జీడిపప్పు పాయసం తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు, ఇంటికి అతిధులు వచ్చినప్పుడు, స్పెషల్ డేస్ లో చాలా సలుభంగా అయ్యే ఈ జీడిపప్పు పాయసాన్ని తయారు చేయవచ్చు. దీనిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల మూడు రోజు పాటు తాజాగా ఉంటుంది. ఈ పాయసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.