Vitamin B Complex Tablets : మన శరీరం సక్రమంగా పని చేయాలంటే అనేక రకాల పోషకాలు అవసరమవుతాయి. పోషకాలు సరిగ్గా అందితేనే మన శరీరం తన విధులను సక్రమంగా నిర్వర్తించగలదు. మన శరీరం తన విధులను సక్రమంగా నిర్వర్తించడానికి గానూ అవసరమయ్యే పోషకాల్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఒకటి. బి కాంప్లెక్స్ విటమిన్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఇవి శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తాయి. శరీరంలో ఈ విటమిన్స్ లోపించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే చాలా మంది బి కాంప్లెక్స్ విటమిన్స్ కి సంబంధించిన క్యాప్సుల్స్ ను కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని అతిగా తీసుకున్నా కూడా అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కనుక ఈ రోజూ మనం బి కాంప్లెక్స్ విటమిన్స్ లో ఉండే రకాల గురించి అలాగే ఈ క్యాప్సుల్స్ ను ఎంత మోతాదులో వాడాలి… వీటిని ఎక్కువగా వాడడం వల్ల మనకు కలిగే దుష్ప్రభావాల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం. బి కాంప్లెక్స్ విటమిన్స్ లో విటమిన్ బి1,బి2 బి3, బి5, బి6, బి7, బి9, బి 12 వంటి రకాలు ఉంటాయి. బి విటమిన్ లోపం ఎక్కువగా వయసు మీద పడిన వారిలో కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్ది శరీరం విటమిన్స్ ను గ్రహించే శక్తిని కోల్పోతుంది. అందువల్ల వయసు పడిన వారిలో బి విటమిన్స్ లోపం ఎక్కువగా వస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలల్లో, ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకునే వారిలో, షుగర్ వ్యాధితో బాధపడే వారిలో, పోషకాహార లోపంతో బాధపడే వారిలో బి విటమిన్స్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విటమిన్స్ లోపించడం వల్ల ఆకలి లేకపోవడం, జీర్ణ సమస్యలు, చర్మం పొడిబారడం, జుట్టు ఊడడం, జుట్టు తెల్లబడడం, నోటిలో పుండ్లు, రక్తహీనత, అలసట, నీరసం వంటి లక్షణాలు మనలో కనిపిస్తాయి.
ఇక ఈ క్యాప్సుల్స్ రోజుకు ఒకటి చొప్పున మాత్రమే తీసుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం ఆహారం తీసుకున్న తరువాత ఈ క్యాప్సుల్ ను వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ కర్యాప్సుల్స్ ను ఎక్కువ కాలం పాటు అస్సలు వాడకూడదు. ఒకటి లేదా రెండు నెలలు వాడి ఆ తరువాత మానేయాలి. అలాగే బి కాంప్లెక్స్ విటమిన్స్ ను వాడడం వల్ల దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏదో ఒక సందర్భంలోనే వీటి వల్ల మనం దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బి కాంప్లెక్స్ విటమిన్స్ నీటిలో కరిగిపోతాయి. ఇవి శరీరంలో ఎక్కువగా ఉంటే మూత్రం ద్వారా బయటకు పోతాయి. ఈ విటమిన్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రం పసుపు రంగులో రావడం, తల తిరిగినట్టుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనుక వైద్యుల సూచన మేరకు తగిన మోతాదులో వీటిని వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.