Nails And Health : మన శరీరం చెప్పే మాటలను కూడా వినాలని అంటున్నారు నిపుణులు. శరీరం ఏంటి మాట్లాడడమేంటి అని మనలో చాలా మంది సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. శరీరంలో వచ్చే మార్పులు ఏదో ఒక అనారోగ్యాన్ని, విటమిన్ల లోపాన్ని సూచిస్తాయి. శరీరంలో కొన్ని భాగాలు మార్పులకు లోనవుతున్నాయంటే వాటి ప్రభావం ఏదో ముఖ్యమైన అవయవం మీద పడుతుందనే విషయాన్నే ముందుగానే మనం గమనించాలి. వీటిని జాగ్రత్తగా గమనిస్తే ముందుగానే చాలా రకాల అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు.
రోజూవారిగా శరీరంలో చాలా రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. అవి మంచివే అయి ఉండవచ్చు. జీవన విధానం వల్ల అయ్యి ఉండవచ్చు. వయసు కారణంగా హార్మోన్లలో వచ్చే మార్పులు కావచ్చు. శరీరంలో ఏ భాగం ఎలాంటి మార్పులకు లోనయితే ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందో ముందే తెలుసుకోవడం మంచిది. ముందుగా గోళ్ల గురించి తెలుసుకుందాం. గోర్లను పరిశీలనగా చూస్తే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. వాటి రంగు, ఆకృతిని బట్టి మన ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు.
కొందరిలో గోర్లు కొద్దిగా పెరగగానే వాటంతట అవే విరిగిపోతూ ఉంటాయి. అలా గోర్లు విరిగిపోతుంటే క్యాల్షియం తక్కువగా ఉందని, విటమిన్ డి లేదా జింక్ వంటి పోషకాల లోపాలు ఉన్నాయని గుర్తించాలి. దీని పరిష్కారానికి కొవ్వు తక్కువగా పాల ఉత్పత్తులు, చేపలు అధికంగా తీసుకోవాలి. అలాగే కొందరిలో గోర్లు తొందరగా పెరగవు. అదేవిధంగా పాలిపోయి కూడా ఉంటాయి. రక్తహీనత, పోషకాహార లోపం ఉన్న వారిలో ఈ లక్షణాలు ఉంటాయి. అలాగే గుండె లేదా కాలేయ సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
పసుపు రంగులో మందంగా నెమ్మదిగా పెరిగే గోర్లు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఉందనడానికి సూచన. ఇలాంటి వారు థైరాయిడ్, డయాబెటిస్ పరీక్షలు కూడా చేయించుకోవాలి. గోర్ల మధ్యలో తెల్లటి చారలు ఉన్నా లేదా గోర్లు మొత్తానికే తెల్లగా ఉన్నా అలాంటి వారిలో కాలేయానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హైపటైటిస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. గోర్లు కనుక నీలం రంగులో ఉంటే శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించడం లేదని అర్థం. అంతేకాకుండా ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని అర్థం.
అదే విధంగా మెడ దగ్గర వాపు ఉంటే థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. అయోడిన్ లోపం కారణంగా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితాలను బట్టి అయోడిన్ ను ఎక్కువ లేదా తక్కువ తీసుకోవడం చేయాలి. అలాగే నాలుకను చూసి కూడా మనలో ఉండే రోగ లక్షణాలను చెప్పవచ్చు. నాలుక పేలవంగా కనబడితే శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గుతుందని అర్థం. దీని వల్ల అలసట, విసుగు వస్తాయి. అందుకోసం ఐరన్ అధికంగా ఉండే మాంసం, గుడ్లు, ఆకుకూరలు వంటి వాటిని తీసుకోవాలి. అదే విధంగా నాలుక ఎర్రగా ఉండి ఏది తిన్నా కూడా కారంగా ఉంటుంది. ఇలా నాలుక ఎర్రగా ఉండి ఏది తగిలినా కూడా మంండుతూ ఉంటే శరీరంలో బి విటమిన్ అలాగే ఐరన్ లోపం ఉందని గుర్తించాలి.
మాంసం, చేపలు, నట్స్ వంటి వాటిని రోజూ వారి ఆహారంలో తీసుకోవాలి. కొందరిలో నాలుక మీద చాలా తెల్లగా ఉంటుంది. ఇది పరిశుభ్రత లేని నాలుక అని అర్థం. నాలుక మీద పాచి పట్టింది అని అర్థం. ఈస్ట్ ఇన్ ఫెక్షన్, కాండిడియాసిస్ రావడానికి ఇది సూచన. నాలుక కనుక ఇలా ఉంటే ఎక్కువ పరిశుభ్రతను పాటించాలి. నాలుక పొడిబారడం అనేది ఒత్తిడికి సూచన. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రాణాయామం, యోగా వంటివి చేసి ఒత్తిడిని తగ్గించుకోవాలి. అదే విధంగా కలువల్లాంటి కన్నులను చూసి కూడా మన ఆరోగ్యం గురించి చెప్పవచ్చు.
కంటిలో ఉండే రెటీనాను చూసి రక్తపోటును తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు క్యాన్సర్ లక్షణాలను కూడా కళ్లను చూసి చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి రక్తపరీక్ష చేస్తే కానీ డయాబెటిస్ ఉందని గుర్తించలేరు. కానీ కళ్లల్లోని రెటీనాను చూసి కూడా డయాబెటిస్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ ఉంటే రెటీనాలో పసుపు రంగు మచ్చలు ఉంటాయి. ఈ స్థితి కంటి చూపును తగ్గించవచ్చు లేదా పూర్తి అంధత్వాన్ని కలిగించవచ్చు. లేజర్ చికిత్స ద్వారా దీనిని తొలగించుకోవచ్చు. అలాగే తెలుపు రంగులో ఉండే కళ్లు పసుపు రంగులోకి మారుతున్నట్టయితే కాలేయానికి సంబంధించిన హైపటైటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే వయసు మీద పడుతున్న వారిలో కళ్లు రంగు మారుతుంటే ఎముకలకు సంబంధించిన వ్యాధి రాబోతుందని అర్థం. కొందరిలో కనుగుడ్డు చుట్టూ గోధుమ రంగులో రింగ్ లాగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండడాన్ని ఈ రింగ్ సూచిస్తుంది. ఇది గుండె జబ్బులకు దారి తీయవచ్చు. ఇలాంటి వారు కచ్చితంగా ఆహార నియమాలను పాటించాలి. చాలా మందికి కంటి దగ్గర కురుపులు వస్తూ ఉంటాయి. కళ్లు మండడంతో పాటు కళ్ల నుండి నీళ్లు కారడం కూడా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా జిడ్డు చర్మం ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. కనుక వీరు ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మనం ఏదైనా సమస్యతో వైద్యుని వద్దకు వెళ్లినప్పుడు ముందుగా మూత్రాన్ని పరిక్షిస్తారు. మనం మన మూత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మన ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. సాధారణ మూత్రం ఎటువంటి గాఢమైన వాసనను కలిగి ఉండదు. కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల మూత్రం అదో రకమైన వాసనను కలిగి ఉంటుంది. కొన్ని రకాల మందులు కూడా మూత్రం రంగును మారుస్తాయి. కాబట్టి మూత్రం రంగును చూసి కూడా కంగారు పడకూడదు. మూత్రం పసుపు రంగులో ఉంటే కాలేయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని సూచన.
మనం తీసుకునే ఆహారంలో బీట్ రూట్, బ్లూబెర్రీ వంటి పదార్థాలు ఉన్నప్పుడు మూత్రం ఎరుపు రంగులో వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ సంబంధిత సమస్యలు, మూత్రాశయ సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇలా మూత్రం ఎరుపు రంగులో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మూత్రం గాఢమైన వాసనను కలిగి ఉంటే డీ హైడ్రేషన్ బారిన పడ్డామని అర్థం. దీని కోసం వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలి. మూత్రంలో మంట వస్తే కనుక మూత్రాశయంలో బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ వచ్చిందని భావించాలి. దీని కోసం నీటిని ఎక్కువగా తాగాలి. నీటిని తాగిన కూడా సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
అలాగే కొందరూ తరచూ మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. రక్తంలో అధిక గ్లూకోజ్ కారణంగా ఇలా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇలా ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తే వైద్యున్ని సంప్రదించడం మంచిది. ఇలా మన శరీర భాషను మనం జాగ్రత్తగా విని మన ఆరోగ్యంపై అవగాహనను పెంచుకోవచ్చు.