Nipah Virus Symptoms : నిన్న మొన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోవిడ్ బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికీ పలు చోట్ల కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే ఈమధ్య కాలంలో మరో వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అదే.. నిపా వైరస్. కేరళలో ఈ వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మొట్టమొదటిసారిగా ఈ వైరస్ ను 1998లో మలేషియా, సింగపూర్‌లలో గుర్తించారు. అక్కడి ఓ గ్రామంలో ఈ వైరస్ గుర్తించబడింది. దీంతో ఆ గ్రామానికి ఉన్న పేరునే ఈ వైరస్‌కు పెట్టడం జరిగింది. తరువాత మన దేశంలో కేరళలో దీన్ని తొలుత గుర్తించారు. 2018 నుంచి ఇప్పటి వరకు కేరళలో సుమారుగా 4 సార్లు ఈ వైరస్ వ్యాప్తి జరిగింది. ప్రస్తుతం కూడా ఈ వైరస్ కేసులు అక్కడ ఎక్కువగా నమోదవుతున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ఈ వైరస్ సోకిన వారు చనిపోయే అవకాశాలు 40 నుంచి 75 శాతం వరకు ఉంటాయి. ఈ వైరస్‌కు చికిత్స అంటూ ఏమీ లేదు. కానీ కొన్ని లక్షణాలను బట్టి ఈ వైరస్ సోకిందని నిర్దారించవచ్చు. నిపా వైరస్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం.
నిపా వైరస్ సోకిన వారిలో ముఖ్యంగా 6 లక్షణాలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. అవేమిటంటే.. ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకిన వారికి తీవ్రమైన జ్వరం వస్తుంది. విపరీతమైన జ్వరంతో బాధపడుతుంటారు. తలనొప్పి కూడా ఉంటుంది. ఈ వ్యాధిగ్రస్తులకు విపరీతమైన అలసట ఉంటుంది. బాగా నీరసంగా ఉంటుంది. కండరాలు తీవ్రంగా నొప్పులు ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో మెదడు వాపుకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది.
నిపా వైరస్ ముఖ్యంగా గబ్బిలాల నుంచి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. గబ్బిలాల్లో ఈ వైరస్ నివాసం ఉంటుంది. అయితే ఈ వైరస్ నుంచి వాటికి ఇమ్యూనిటీ ఉంటుంది. కనుక ఈ వైరస్ వాటిలో ఇన్‌ఫెక్షన్‌ను కలిగించలేదు. కానీ గబ్బిలాలు తిరిగిన ఆహారాలు లేదా పండ్లను తినడం వల్ల వాటిపై ఉండే వైరస్ మన శరీరంలోకి వ్యాప్తి చెందుతుంది. అలాగే జంతువుల నుంచి కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. గబ్బిలాలు వాలిన ఆహారాలను తిన్నా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అలాగే నిపా వైరస్ సోకిన వ్యక్తిని తాకినా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.
నిపా వైరస్‌కు చికిత్స అంటూ ఏమీ లేదు. కానీ లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. లేదంటే వైరస్ ప్రాణాంతకం అవుతుంది.