Ovarian Cancer Symptoms : మనలో చాలా మంది స్త్రీలను అనారోగ్యానికి గురి చేస్తున్న సమస్యలల్లో అండాశయ క్యాన్సర్ కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య బారిన పడుతున్న స్త్రీల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జన్యుపరమైన కారణాలతో పాటు మారిన జీవన విధానం ఈ సమస్య బారిన పడడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఎంతో ప్రమాదకరమైన ఈ అండాశయ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న స్త్రీలు కూడా ఉన్నారు. అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్స్, పెరిటోనియంలో ఎక్కడైనా ఈ క్యాన్సర్ ఉద్భవించవచ్చు. అయితే అండాశయ క్యాన్సర్ బారిన పడిన ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే తగిన చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. అయితే చాలా మంది స్త్రీలకు అండాశయ క్యాన్సర్ బారిన పడిన వెంటనే కనిపించే లక్షణాల గురించి ఎటువంటి అవగాహన ఉండదు.
దీంతో వారు ప్రాణాలను కోల్పోయే పరిస్థితికి దారి తీస్తుంది. కనుక ప్రతి ఒక్కరు ఈ లక్షణాల గురించి అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. అండాశయ క్యాన్సర్ యొక్క ప్రారంభ సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అండాశయ క్యాన్సర్ బారిన పడిన వారిలో కడుపు ఎల్లప్పుడూ ఉబ్బరంగా ఉంటుంది. ఉదరంలో తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. పొత్తి కడుపు పరిమాణం కూడా పెరుగుతుంది. ఈ సమస్యను వారాల పాటు ఎదుర్కొంటున్నట్టు అయితే వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం. అలాగే కొద్ది ఆహారాన్ని తీసుకున్నప్పటికి కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి అనుభూతినైతే మనం పొందుతామో తక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా మనకు పూర్తిగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది కూడా అండాశయ క్యాన్సర్ యొక్క సంకేతం.
అలాగే మనం తీసుకున్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవ్వదు. తరుచూ అజీర్తి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. తరుచూ అజీర్తి సమస్యను ఎదుర్కొంటున్నట్లైతే వైద్యున్ని సంప్రదించడం మంచిది. అదే విధంగా అండాశయ క్యాన్సర్ బారిన పడిన స్త్రీలల్లో పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి ఉంటుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పి కంటే ఎక్కువగా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. అలాగే నెలసరి కూడా క్రమరహితంగా వస్తుంది. అదే విధంగా సాధారణం కంటే ఎక్కువగా మూత్రవిసర్జనకు వెళ్లాలి అనిపిస్తుంది. పొత్తి కడుపులో నొప్పి, ఉబ్బరంతో పాటు మూత్రవిసర్జనకు వెళ్లాలి అనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీనిని అండాశయ క్యాన్సర్ యొక్క సంకేతంగా భావించాలి. అలాగే అండాశయ క్యాన్సర్ బారిన పడిన స్త్రీలల్లో వెన్నునొప్పి ఎక్కువగా ఉంటుంది.
అలాగే ఈ నొప్పి నిరంతరంగా ఉంటుంది. అలాగే నెలసరి సక్రమంగా రాదు. ఒకవేళ వచ్చిన రక్తస్రావం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కనుక ఋతు చక్రంలో మరియు రక్తస్రావంలో మార్పులు గమనించిన వెంటనే తగిన చర్యలు తీసుకోవడం అవసరం. ఈవిధంగా ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి క్యాన్సర్ కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. అండాశయ క్యాన్సర్ ను మొదటిదశలో ఉన్నప్పుడే గుర్తించడం వల్ల ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చని క్యాన్సర్ నుండి బయటపడి తిరిగి సాధారణ జీవితాన్ని గడపవచ్చని నిపుణులు చెబుతున్నారు.