Capsicum Tomato Masala Curry : క్యాప్సికం టమాట మసాలా కర్రీ.. క్యాప్సికం, టమాటాలు కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఎక్కువగా లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు అలాగే లంచ్ బాక్స్ లల్లోకి దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. దేనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని తేలికగా చేసుకోవచ్చు. క్యాప్సికం అంటే ఇష్టం లేని వారు కూడా ఈ కర్రీని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే క్యాప్సికం టమాట మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం టమాట మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెమ్మలు – 6, పచ్చిమిర్చి – 3, కరివేపాకు – 2 రెమ్మలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), పసుపు – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – పెద్దవి 3, తరిగిన క్యాప్సికం – పావుకిలో, ఉప్పు – తగినంత, కారం – తగినంత, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
క్యాప్సికం టమాట మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఇది వేగిన తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత టమాట ముక్కలు, పసుపు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తగా మగ్గిన తరువాత క్యాప్సికం ముక్కలు వేసి కలపాలి. తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించాలి. క్యాప్సికం ముక్కలు పూర్తిగా మగ్గి నూనె పైకి తేలిన తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం టమాట మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా సులభంగా క్యాప్సికం టమాట మసాలా కర్రీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తినడం వల్ల రుచితో పాటు క్యాప్సికం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు.