Metformin Tablets : మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తుతున్న అనారోగ్య సమస్యలల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిందే. షుగర్ వ్యాధి గ్రస్తులకు వైద్యులు ఎక్కువగా సూచించే మందులల్లో మెట్ ఫార్మిన్ ఒకటి. దీనిని టైప్ 2 డయాబెటిస్ లో ఔషధంగా వాడతారు. ఈ టాబ్లెట్ తెలియని షుగర్ పేషెంట్స్ ఉండరనే చెప్పవచ్చు. షుగర్ ను అదుపులో ఉంచడంలో ఈ మెట్ ఫార్మిన్ చక్కగా పని చేస్తుంది. అయితే ఈ మెట్ ఫార్మిన్ ను షుగర్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు కూడా వాడతారని మనలో చాలా మందికి తెలియదు. అలాగే దీనిని ఎక్కువగా వాడడం వల్ల మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని దీని వల్ల కలిగే దుష్ప్రభ్రావాలు కూడా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మెట్ ఫార్మిన్ ను షుగర్ తో పాటు ఏ ఇతర సమస్యలకు వాడతారు.
అలాగే దీని వల్ల మనకు కలిగే దుష్ప్రభావాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మెట్ ఫార్మిన్ ను షుగర్ తో పాటు స్త్రీలల్లో వచ్చే పిసిఒడి సమస్యలకు కూడా ఔషధంగా ఇస్తూ ఉంటారు. అలాగే కొన్ని రకాల మానసిక సమస్యలతో బాధపడే వారికి కూడా ఔషధంగా ఇస్తారు. అంతేకాకుండా మనం ఎక్కువ కాలం పాటు అనారోగ్య సమస్యలు రాకుండా జీవించడానికి, మన జీవిత కాలాన్ని పెంచుకోవడానికి కూడా మెట్ ఫార్మిన్ ఉపయోగపడుతుందని నిపుణులు తాజా పరిశోధనల ద్వారా తెలియజేసారు. కొందరు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి షుగర్ లేనప్పటికి రోజూ ఒక మెట్ ఫార్మిన్ టాబ్లెట్ ను వేసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ మెట్ ఫార్మిన్ ను అధికంగా వాడడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే వాంతులు, విరోచనాలు, పొట్ట ఉబ్బరం, నీళ్ల విరోచనాలు, గ్యాస్ వంటి ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే మెట్ ఫార్మిన్ ను వాడడం వల్ల శరీరంలో విటమిన్ బి12 లోపం కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా మెట్ ఫార్మిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండాలంటే దీనిని భోజనం తరువాత తీసుకోవడం మంచిది. అలాగే ఒకేసారి ఎక్కువ మోతాదు కాకుండా తక్కువ మోతాదు నుండి తీసుకోవడం ప్రారంభించి క్రమంగా ఎక్కవ మోతాదు వరకు తీసుకోవాలి. అలాగే దీనిని రోజుకు రెండుసార్లు తీసుకునే వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఈ మెట్ ఫార్మిన్ టాబెట్లను ఎక్కువ వ్యవధితో తీసుకోవాలి. వీటి మధ్య వ్యవధి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఉదయం తీసుకుంటే మరలా సాయంత్రం తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక కంపెనీ టాబ్లెట్ లను వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటే వారు మరో కంపెనీ టాబ్లెట్ లను వాడి చూడాలి. ఇలా చేయడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ తగ్గే అవకాశం ఉంది. ఇలా మెట్ ఫార్మిన్ ను వాడి దాని వల్ల కలిగే దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి బదులుగా చక్కటి ఆహార నియమాలను, జీవనశైలినిపాటిస్తూ అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడమే మంచిదని కూడా నిపుణులు సూచిస్తున్నారు.