పల్స్ ఆక్సీమీటర్ ద్వారా రెండు రకాల రీడింగ్స్‌ను తెలుసుకోవచ్చు. ఒకటి.. బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ లేదా ఆక్సిజన్ శాచురేషన్ లెవల్స్ (ఎస్‌పీవో2). పల్స్ లేదా హార్ట్ రేట్ (బీపీఎం). ఆక్సిజన్ శాచురేషన్ లెవల్స్ (ఎస్‌పీవో2) 95 నుంచి 100 శాతం మధ్య ఉంటే నార్మల్‌గానే ఉన్నాయని అర్థం.
అయితే ఆక్సిజన్ శాచురేషన్ లెవల్స్ 92 శాతం కన్నా తక్కువ ఉంటే దాన్ని హైపాక్సియా అంటారు. అంటే శరీర కణాలకు తగినంత ఆక్సిజన్ లభించడం లేదని అర్థం. ఇక ఆక్సిజన్ శాచురేషన్ లెవల్స్ 88 శాతం కన్నా తక్కువకు పడిపోతే వెంటనే హాస్పిటల్ లో చేరి చికిత్సను తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం, ఆలస్యం చేయరాదు. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.
ఇక పల్స్ రేట్ (బీపీఎం) అంటే ఒక నిమిషానికి గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుందో తెలియజేసే విలువ. గుండె కొట్టుకోవడం వల్ల రక్త నాళాల నుంచి రక్తం పంప్ అయి శరీరంలోని భాగాలకు చేరుతుంది. దీంతో ఆయా భాగాలకు పోషకాలు, శక్తి, ఆక్సిజన్ అందుతాయి. దీంతో శరీరం సరిగ్గా పనిచేస్తుంది.
సాధారణంగా ఏ వ్యక్తికి అయినా సరే పల్స్ రేట్ 60 నుంచి 100 మధ్య ఉంటుంది. వ్యాయామం చేసినప్పుడు, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, గాయాలు అయినప్పుడు, భావోద్వేగాలకు లోనైనప్పుడు పల్స్ రేట్ అసాధారణ రీతిలో మారుతుంటుంది. గుండె మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా కొట్టుకుంటుంది. ఇక 12 ఏళ్ల వయస్సు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు సాధారణంగానే పురుషుల కన్నా పల్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది.
పల్స్ రేట్ 100 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని టాకీకార్డియా అంటారు. అదే 60 కన్నా తక్కువకు పడిపోతే దాన్ని బ్రాడీ కార్డియా అంటారు. పల్స్ రేట్ ఎప్పుడూ 100కు మించి ఉన్నా లేదా 60 కన్నా తక్కువగా ఉన్నా ప్రమాదం. గుండె సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఆక్సిజన్ శాచురేషన్ లెవల్స్, పల్స్ రేట్‌ను ఎప్పటికప్పుడు మీటర్ ద్వారా తెలుసుకుంటుండాలి. దీంతో ప్రాణాపాయ పరిస్థితులను ముందే పసిగట్టి సకాలంలో చికిత్స తీసుకుని ప్రాణాలను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365