వివాహం అయిన ఏ దంపతులు అయినా పిల్లలను కనాలనే అనుకుంటారు. కాకపోతే కొందరు ఆ పని పెళ్లయిన వెంటనే చేస్తారు. కొందరు ఆలస్యంగా పిల్లల్ని కంటారు. కానీ కొందరికి మాత్రం ఎంత ప్రయత్నించినా అస్సలు సంతానమే కలగదు. దీంతో అలాంటి వారు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడం లేదా పిల్లలను దత్తత తీసుకోవడం చేస్తుంటారు. అయితే అసలు పిల్లలను కనే విషయానికి వస్తే.. సాధారణంగా ఏ జంటకైనా ఆడ లేదా మగ ఒక శిశువే జన్మిస్తుంది. కానీ కొందరికి కవల పిల్లలు పుడతారు. మరి ఇలా ఎందుకు జరుగుతుందో, అసలు ఎలాంటి దంపతులకు కవల పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామా. దంపతులకు కవలపిల్లలు పుట్టడానికి అనేక కారణాలుంటాయి. అవి నిర్దిష్టమైనవని చెప్పలేకున్నా కొన్ని కారణాలను మాత్రం సైంటిస్టులు చెబుతున్నారు. అవేమిటంటే..
కుటుంబంలో ఎవరికైనా వారి వంశంలో గతంలో కవల పిల్లలు పుట్టి ఉంటే ముందు తరాల వారికి కూడా కవల పిల్లలు పుట్టే అవకాశం 29 శాతం వరకు ఉంటుందని సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. అమెరికా, ఆఫ్రికా దేశాల వారికి కవల పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అక్కడ పుడుతున్న ప్రతి 1000 మంది శిశువుల్లో 37 మంది కవలలు ఉంటున్నారట. ప్రపంచంతో పోలిస్తే ఇది ఎక్కువ. ఇతర దేశాల్లో ఈ సంఖ్య 32గానే ఉంది. మహిళ వయస్సు 35 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉంటే అలాంటి వారికి కవలలు పుట్టే చాన్స్ ఎక్కువగా ఉంటుందట. సాధారణంగా ఇలాంటి వారిలో విడుదలయ్యే అండాల నాణ్యత ఎక్కువగా ఉండి, ఒక్కోసారి రెండు అండాలు విడుదలైతే కవల పిల్లలు పుడతారట.
మహిళల ఎత్తు 5 అడుగుల 5 ఇంచుల ఉన్నా వారికి కవల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని సైంటిస్టులు చేసిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్ – స్థూలకాయానికి కొలమానం) 30 కన్నా ఎక్కువగా ఉండే మహిళలకు కవల పిల్లలు పుట్టే అవకాశం బాగా ఉంటుందట. పిల్లలు పుట్టకుండా వేసుకునే బర్త్ కంట్రోల్ పిల్స్‌ను ఒకేసారి మహిళలు ఆపేస్తే అలాంటి వారిలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ అండాలు విడులయ్యేందుకు అవకాశం ఉంటుందట. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకైనా ఉంటే అలాంటి వారికి కవలలు పుట్టే చాన్స్ కూడా ఉంటుందట. పిల్లల్ని ఎక్కువగా కన్న మహిళలకు కవలలు పుట్టే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
పిల్లలకు మహిళలు ఎక్కువ కాలం పాలు ఇస్తే అలాంటి వారికి కవలలు పుట్టే చాన్స్ ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఐవీఎఫ్ పద్ధతిలోనూ కవలలను కనే చాన్స్ ఉంటుందట. కానీ అది చాలా రిస్క్‌తో కూడుకున్న పని అట. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే మహిళల్లో, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను అధిక డోస్‌లలో వేసుకునే వారిలో, పాలు, పాల సంబంధ ఉత్పత్తులను ఎక్కువగా తీసుకునే మహిళలకు కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.