అనేకమంది రాక్షసుల లాగే ఒక అసురుడు మహశివుని తలచుకుంటూ ఘోర తపస్సు చేశాడు. భోళాశంకరుడి మనసు ఇట్టే కరిగిపోయింది. హిరణ్యకశిపుడు తదితరులకు ఇచ్చినట్లుగానే ఈ అసురునికి కూడా వరం ప్రసాదించేందుకు వెంటనే ప్రత్యక్షమై భక్తా, ఇంత తీవ్ర తపస్సుకు ఎందుకు పూనుకున్నావు? ఏమి నీ కోరిక? మనో వాంఛ ఏమిటో చెబితే, అనుగ్రహిస్తాను అంటూ అడిగాడు. రాక్షసుడు తన తపస్సు ఫలించి, మహాశివుడు ప్రత్యక్షమైనందుకు సంతోషిస్తూ నమస్కరించాడు. చెప్పు అసురా, ఏం వరం కావాలి?. దేవా, మహాశివా, నేను ఎవరి తలమీద చేయి పెడితే, వారు తక్షణం భస్మం అయ్యేలా వరం అనుగ్రహించు.. అన్నాడు. భోళా శంకరుడు ముందువెనుకలు ఆలోచించలేదు. అలాగే, భక్తా.. అనుగ్రహించాను.. ఈ క్షణం నుండీ వరం పనిచేస్తుంది. నువ్వు ఎవరి తలమీద చేయి పెడితే, వారు వెంటనే భస్మమైపోతారు.. ఇకపై నువ్వు భస్మాసురుడిగా ప్రసిద్ధమౌతావు.. అన్నాడు.
ఆ రాక్షసుడు ఎంత హీనుడంటే, వరం ప్రసాదించిన మహాశివుని తలమీదే చేయిపెట్టి తన వరాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. భస్మాసురుని అంతరంగాన్ని గ్రహించిన భోళా శంకరుడు గత్యంతరం లేక, శ్రీహరి మాత్రమే తనను రక్షించగలడు అనుకుని, వైకుంఠంవైపు పరుగుతీసాడు. భస్మాసురుడు శివుని వెంట పరుగు లంకించుకున్నాడు. శ్రీహరి క్షణంలో విషయం గ్రహించాడు. హరా, నువ్వు ఒకపక్కన ఉండి చూస్తుండు.. అని నవ్వి, తాను ముగ్ధమనోహర రూపంతో మోహినీ రూపం దాల్చాడు. అక్కడికొచ్చిన భస్మాసురుడు, మోహినీ రూపాన్ని చూసి మోహితుడయ్యాడు. ఆమెని చూపులతోనే మింగేస్తూ, సుందరీ, నువ్వెవరు? ఇంత అందాన్ని నేను ఎన్నడూ చూడలేదు..తొలిచూపులోనే నీమీద అపరిమితమైన ప్రేమ కలిగింది.. నిన్ను పెళ్ళి చేసుకోవాలనిపిస్తోంది.. అన్నాడు.
ఓరి నీచుడా, నీ పైత్యం అణచడానికే ఈ అవతారం ఎత్తానురా అనుకుని మర్మగర్భంగా నవ్వింది మోహిని. మాటలతో ఆగక దగ్గరికి వెళ్ళబోయాడు భస్మాసురుడు. ఆగు, ఆగు.. అంత తొందరెందుకు? నన్ను పెళ్ళి చేసుకుంటాను అని నాతో చెప్పగలిగిన వారు నాకు ఇంతవరకూ తారసపడలేదు… నీ ధైర్యసాహసాలు నచ్చాయి.. నిన్ను చేసుకుంటాను.. అయితే ఒక షరతు.. చెప్పు..ఎంత క్లిష్టమైన షరతయినా ఫరవాలేదు. అయ్యో, అంత కష్టమైంది ఏమీ కాదు.. నాకు నృత్యం అంటే చాలా ఇష్టం.. నేను కొంతసేపు నృత్యం చేస్తాను.. నువ్వు అచ్చం నాలాగా చేయగలిగితే చాలు.. అప్పుడు నేనే నీ మెడలో వరమాల వేస్తాను. ఇదేం వింత షరతు అనుకున్న భస్మాసురుడు నవ్వి, సరే, చెయ్యి అన్నాడు. మోహిని నృత్యం మొదలుపెట్టింది. భస్మాసురుడికి ఇసుమంత సందేహం కూడా రాలేదు. ఆమెని చూసి పరవశిస్తూ, అనుకరించే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు. మోహిని నృత్యం చేసీ చేసీ, చివరికి తన తలమీద చేయి పెట్టుకుంది. విచక్షణ కోల్పోయిన భస్మాసురుడికి వరం గురించి జ్ఞాపకమే లేదు. మోహినిని అనుకరించి, తాను కూడా తన తలపై చేయి పెట్టుకున్నాడు. మరుక్షణం భస్మమైపోయాడు.