Alasanda Garelu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో అలసందలు కూడా ఒకటి. అలసందల్లో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అలసందలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. చాలా మంది అలసందలతో కూరను, గుగ్గిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటారు. వీటితో పాటు అలసందలతో మనం ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే గారెలను కూడా తయారు చేసుకోవచ్చు. అలసంద గారెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. రుచిగా, క్రిస్పీగా అలసంద గారెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అలసంద గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
5 నుండి 6 గంటల పాటు నానబెట్టిన అలసందలు – అరకిలో, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3 లేదా 4, తరిగిన కరివేపాకు -ఒక రెమ్మ, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
అలసంద గారెల తయారీ విధానం..
ముందుగా అలసందలను జల్లిగిన్నెలో వేసి నీరంతా పోయేలా చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అలసందలన్నింటిని మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని వేసి కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ తడి వస్త్రంపై ఉంచి గారెల ఆకారంలో వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ గారెలను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అలసంద గారెలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో లేదా చట్నీలతో తినవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా అలసందలతో గారెలను తయారు చేసుకుని తింటూ ఎంజాయ్ చేయవచ్చు.