Aloo 65 : బంగాళాదుంపలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంపలతో చేసిన వంటకాలను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. బంగాళాదుంపలతో చేసుకోదగిన వంటకాల్లో ఆలూ 65 కూడా ఒకటి. ఈ వంటకం ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తూ ఉంటుంది. ఫంక్షన్స్ లో కూడా ఈ వంటకాన్ని ఎక్కువగా సర్వ్ చేస్తూ ఉంటారు. ఆలూ 65 చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ ఆలూ 65 ని పక్కా రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రెస్టారెంట్ స్టైల్ ఆలూ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 300 గ్రా., కార్న్ ఫ్లోర్ -3 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, వెల్లుల్లి తరుగు – 6, పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఉల్లిపాయ తరుగు – రెండు టీ స్పూన్స్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, చిలికిన పెరుగు – 200 గ్రా., నిమ్మరసం – ఒక టీ స్పూన్, రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

రెస్టారెంట్ స్టైల్ ఆలూ 65 తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలను పొట్టు తీసి ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలను నీటిలో వేసి 80 శాతం మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని చల్లారే వరకు ఉంచాలి. తరువాత కొద్దిగా ఉప్పు, మైదా పిండి, కార్న్ ఫ్లోర్ వేసి ముక్కలు చిదిరిపోకుండా కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను వేసి వేయించాలి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత జీలకర్ర పొడి, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత చిలికెన పెరుగు, నిమ్మరసం, ఫుడ్ కలర్ ను వేసి కలపాలి.
తరువాత స్టవ్ ఆన్ చేసి వేయించిన బంగాళాదుంప ముక్కలను వేసి పెద్ద మంటపై కలుపుతూ వేయించాలి. వీటిని మరో 2 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పక్కా రెస్టారెంట్ స్టైల్ ఆలూ 65 తయారవుతుంది. దీనిని స్నాక్స్ గా లేదా ఇతర వంటకాలతో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. బంగాళాదుంపలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా ఆలూ 65 ని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఒక్క ముక్క కూడా విడిచి పెట్టకుండా ఈ ఆలూ 65 ని అందరూ ఇష్టంగా తింటారు.