Eucalyptus Leaves : ఈ భూమి మీద చాలా చక్కటి వాసనను కలిగే మొక్కలు చాలా ఉన్నాయి. వాటిలో ఉండే అందం, వాసస ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇలా సువాసనను కలిగి ఉండే ఔషధ మొక్కలు ఉన్నాయన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. చాలా మంది డియోడ్రెంట్ లను, ఫర్ ఫ్యూమ్ లను ఉపయోగిస్తున్నారు కానీ సహజ సిద్దమైన సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయని చాలా తక్కువ మందికే తెలుసు. అటువంటి సువాసనలను వెదజల్లే ఔషధ వృక్షమే నీలగిరి చెట్టు. ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ చక్కటి వాసన వస్తూ ఉంటుంది. దీనిని కలపగా ఎక్కువగా ఉపయోగిస్తారు కానీ దీనిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయన్న సంగతి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఈ చెట్టు ఆకులను, బెరడును, పూలను కూడా ఔషధంగా ఉపయోగిస్తారు. అలాగే దీనిని నుండి తీసే నూనెను యూకలిప్టస్ నూనె అంటారు. ఇది కూడా చక్కటి ఔషధంగా మనకు ఉపయోగపడుతుంది.
యూకలిప్టస్ చెట్టు వల్ల మనకుకలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చెట్టు లేత ఆకులను సేకరించి పేస్ట్ లాగా చేయాలి. తరువాత ఈ పేస్ట్ ను గోరు వెచ్చగా చేసి తలకు పట్టించడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అలాగే నీలగిరి చెట్టు బెరడుతో చేసిన కాషాయంతో గాయాలను కడగడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. చర్మ సమస్యలు, వాపులు ఉన్న చోట ఈ కషాయంతో కడుగుతూ ఉండడం వల్ల ఆయా సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. ఈ చెట్టు నుండి తీసే నీలగిరి తైలం శిరో రోగాలకు, తలనొప్పికి అద్భుతుంగా పని చేస్తుంది. ఈ నూనె చక్కటి వాసన కలిగి ఉంటుంది. దీనిని వాసన చూడడం వల్ల ఒత్తిడి, టెన్షన్ తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ యూకలిప్టస్ నూనెను కొబ్బరి నూనెలో కలిపి మెడ మీద, చెవుల వెనుక రాసుకోవడం వల్ల మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి.
ఒత్తిడి, ఆందోళన మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే స్నానం చేసే నీటిలో 5 లేదా 6 చుక్కల యూకలిప్టస్ నూనెను వేసుకుని ఆ నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అలాగే చెవి నొప్పితో బాధపడేటప్పుడు దూదిని ఈ యూకలిప్టస్ నూనెతో తడిపి చెవి రంధ్రం దగ్గర ఉంచాలి. ఇలా చేయడం వల్ల చెవి నొప్పి, చెవిలో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ యూకలిప్టస్ నూనెను కొబ్బరి నూనెలో కలిపి చర్మానికి రాసుకోవడం వల్ల కీటకాలు, దోమలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే నోటి దుర్వాసన సమస్యతో బాధపడే వారు వేడి నీటిలో యూకలిప్టస్ నూనెను 10 చుక్కల మోతాదులో వేసి కలపాలి. తరువాత ఈ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి.
ఇలా పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోట్లో ఉండే క్రిములను నశింపజేసి నోటి దుర్వాసన సమస్య రాకుండా చేస్తుంది. అయితే ఇలా పుక్కిలించేటప్పుడు నోట్లోకి ఈ నూనె వెళ్లకుండా చూసుకోవాలి. జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు నీటిలో ఈ నూనెను వేసుకుని ఆవిరి పట్టడం వల్ల సత్వర ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా నీలగిరి చెట్టును ఉపయోగించి మనం వివిధ రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చని దీనిని ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.