Aloo Appadalu : మనం బంగాళాదుంపలతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో అప్పడాలు కూడా ఒకటి. ఆలూ అప్పడాలు చాలా రుచిగా, కరకరలాడుతూ ఉంటాయి. పప్పు, సాంబార్ వంటి వాటిలోకి తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే స్నాక్స్ గా కూడా వీటిని తినవచ్చు. బంగాళాదుంపలు ఉంటే చాలు వీటిని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ అప్పడాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ అప్పడాల తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్దగా ఉండే బంగాళాదుంపలు – కిలో, ఉప్పు – 3 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఆలూ అప్పడాల తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసేసి నీటిలో వేసుకోవాలి. తరువాత ఒక్కో బంగాళాదుంపను తీసుకుని స్లైసర్ సహాయంతో స్లైస్ లుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని నీటిలో వేసి బాగా కడగాలి. తరువాత గిన్నెలో నీటిని తీసుకుని అందులో ఉప్పు వేసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక బంగాళాదుంప స్లైస్ లను వేసి రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని నీరంతా పోయేలా పూర్తిగా వడకట్టాలి. తరువాత శుభ్రమైన వస్త్రంపై ఈ బంగాళాదుంప స్లైస్ లను ఒక్కొక్కటిగా వేసి ఎండలో ఉంచి ఎండబెట్టాలి.
లేదంటే ఫ్యాన్ కింద ఉంచి పూర్తిగా ఎండిపోయే వరకు ఆరబెట్టాలి. బంగాళాదుంప స్లైస్ లు పూర్తిగా ఎండిన తరువాత డబ్బాలో వేసి గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆలూ అప్పడాలు తయారవుతాయి. ఇవి 6 నెలల పాటు తాజాగా ఉంటాయి. ఈ అప్పడాలను వేయించడానికి కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అప్పడాలను ఒక్కొక్కటిగా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ అప్పడాలు తయారవుతాయి. వీటిని నేరుగా ఇలాగే తినవచ్చు లేదా సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.