Aloo Dum Biryani : మనకు రెస్టారెంట్ లలో లభించే వివిధ రకాల రుచికరమైన బిర్యానీ వెరైటీస్ లో ఆలూ దమ్ బిర్యానీ కూడా ఒకటి. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఆలూ దమ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఫంక్షన్ లల్లో కూడా దీనిని సర్వ్ చేస్తూ ఉంటారు. ఈ ఆలూ దమ్ బిర్యానీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా బంగాళాదుంపలతో బిర్యానీని తయారు చేసి తీసుకోవచ్చు. ఆలూ దమ్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ దమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 5 ( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 3 టేబుల్ స్పూన్స్, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 10, అల్లం – ఒక ఇంచు ముక్క, పచ్చిమిర్చి – 6, కొత్తిమీర – కొద్దిగా, పుదీనా – కొద్దిగా, పెరుగు – అర కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, జాపత్రి – కొద్దిగా, లవంగాలు – 4, మిరియాలు -10, యాలకులు – 3, నల్ల యాలక్కాయ – 1, అనాస పువ్వు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, క్యారెట్ ముక్కలు – పావు కప్పు, ప్రోజెన్ బఠాణీ – పావు కప్పు, టమాట ముక్కలు – అర కప్పు, నిమ్మరసం – అర చెక్క.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒకటిన్నర కప్పులు, నీళ్లు – 6 కప్పులు, సాజీరా – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, దాల్చిన చెక్క- ఒక ఇంచు ముక్క, మిరియాలు – 8, అనాస పువ్వు – 1, లవంగాలు – 3, యాలకులు – 2, ఉప్పు – 2 టీ స్పూన్స్, నూనె – 2 టీ స్పూన్స్.
ఆలూ దమ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసేసి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని నీటిలో వేసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత కొద్దిగా ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బంగాళాదుంప ముక్కలను సగానికి పైగా మగ్గించాలి. బంగాళాదుంప ముక్కలు మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. తరువాతజార్ లో వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా అయ్యేవరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇప్పుడు బిర్యానీ ఉడికించే గిన్నెను తీసుకుని అందులో పెరుగును వేసుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మెంతి వేసికలపాలి. తరువాత మసాలా దినుసులు, వేయించిన బంగాళాదుంప ముక్కలు, క్యారెట్, బఠాణీ, వేయించిన ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు వేసి బాగా కలపాలి. తరువాత గిన్నె అంతా సమానంగా చేసుకుని పైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు చల్లుకుని పక్కకు ఉంచాలి.తరువాత అన్నం తయారీకి గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడయ్యాక అందులో బియ్యం తప్ప మిగిలిన పదార్థాలు వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి 80 నుండి 90 శాతం ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టాలి. ఇప్పుడు అన్నాన్ని ముందుగా సిద్దం చేసుకున్న బంగాళాదుంపలపై ముందుగా ఒక లేయర్ గా వేసుకోవాలి.
తరువాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తరువాత మిగిలిన అన్నాన్ని వేసుకుని పైన కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు చల్లుకోవాలి. తరువాత పావు కప్పు అన్నం ఉడికించిన నీటిని అంచుల చుట్టూ వేసుకోవాలి. తరువాత వేడి నెయ్యిలో కొద్దిగా పసుపు వేసి కలిపి అన్నం పైన వేసుకోవాలి. తరువాత సిల్వర్ ఫాయిల్ తో మూసేసి మూత పెట్టాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి 2 నిమిషాల పాటు పెద్ద మంటపై దమ్ చేసుకోవాలి. తరువాత మంటను మధ్యస్థం కంటే కొద్దిగా తక్కువగా చేసి 8 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ దమ్ బిర్యానీ తయారవుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఈ దమ్ బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.