Aloo Kurma : బంగాళాదుంపలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతోచేసే వంటకాల్లో ఆలూ కుర్మా కూడా ఒకటి. ఆలూ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే ఆలూ కుర్మా కూడా చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కుర్మాను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దేనితోనైనా తినడానికి వీలుగా ఉండే రుచికరమైన ఆలూ కుర్మాను సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 2, యాలకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, సాజీరా – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, తరిగిన పచ్చిమిర్చి – 3, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, కరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన టమాటాలు – మధ్యస్థంగా ఉన్నవి 2, క్యూబ్స్ లాగా తరిగిన బంగాళాదుంపలు – 2, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆలూ కుర్మా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఇవి వేగిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ టమాట ముక్కలు పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత బంగాళాదుంప ముక్కలు, పసుపు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి వీటిలో మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి బంగాళాదుంప ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ముక్కలు ఉడికి కూర దగ్గర పడిన తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ కుర్మా తయారవుతుంది. దీనిని అన్న, చపాతీ, రోటీ, బగారా అన్నం వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.