Aloo Manchurian : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంపలతో చేసుకోదగిన వంటకాల్లో ఆలూ మంచురియా ఒకటి. ఇది మనకు రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. చాలా మంది ఈ ఆలూ మంచురియాను ఇష్టంగా తింటారు. బయట లభించే విధంగా అచ్చం అదే రుచితో దీనిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు కూడా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ ఆలూ మంచురియాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ మంచురియా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన బంగాళాదుంపలు – 300 గ్రా., ఉప్పు – తగినంత, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, టమాట కిచప్ – ఒక టేబుల్ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, చైనీస్ చిల్లీ పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, వెనిగర్ – అర టీ స్పూన్, నీళ్లు – పావు కప్పు, తెల్ల మిరియాల పొడి – ఒక టీ స్పూన్, పంచదార – పావు టీ స్పూన్, నల్ల మిరియాల పొడి – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ – కొద్దిగా.
ఆలూ మంచురియా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత బంగాళాదుంప ముక్కలను వేసి 70 శాతం ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత వాటిని వడకట్టి పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. తరువాత ఈ బంగాళాదుంప ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, కార్న్ ఫ్లోర్, మైదా పిండి వేసి కలపాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి పెద్ద మంటపై వేయించాలి. ఇవి అన్నీ చక్కగా వేగిన తరువాత టమాట కిచప్, సోయాసాస్, చిల్లీ పేస్ట్, వెనిగర్, ఉప్పు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత పంచదార, తెల్ల మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు పెద్ద మంటపై వేయించిన తరువాత వేయించిన బంగాళాదుంప ముక్కలను వేసి కలపాలి. పెద్ద మంటపై సాసెస్ అన్నీ ముక్కలకు పట్టేలా వేయించాలి. తరువాత స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మంచురియా తయారవుతుంది. దీనిని వేడి ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ విధంగా ఆలూ మంచురియాను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.