Aloo Palak : మనం పాలకూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. పాలకూరతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పాలకూరతో తయారు చేసుకోదగిన వంటకాల్లో ఆలూ పాలక్ కర్రీ ఒకటి. ఆలూ పాలక్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఒక్కసారి ఆలూ పాలక్ కర్రీని తింటే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతూ ఉంటారు. ఎంతో రుచిగా ఉండే ఆలూ పాలక్ ను ధాబా స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ పాలక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పాలకూర – 200 గ్రా., ఉడికించిన బంగాళాదుంపలు – 200గ్రా., నూనె – పావు కప్పు, ఎండుమిర్చి – 4, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి -4, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్.
ఆలూ పాలక్ తయారీ విధానం..
ముందుగా పాలకూరను వేడి నీటిలో వేసి 3 నుండి 4 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత దీనిని గంటెతో తీసి వెంటనే చల్లటి నీటిలో వేసుకోవాలి. తరువాత ఈ పాలకూరను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు సగానికి పైగా వేగిన తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత అల్లం పేస్ట్, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి.
దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ ను వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత బంగాళాదుంపలను ముక్కలుగా చేసి వేసుకుని కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత నెయ్యి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పాలక్ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆలూ పాలక్ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.