Aloo Phool Makhana Kurma : ఫూల్ మఖన.. వేయించిన తామర గింజలనే ఫూల్ మఖన అంటారు. వీటిని ఎంతో కాలంగా ఆహారంలో భాగంగా తీసుకున్నప్పటికి నేటి తరుణంలో వీటి వాడకం ఎక్కువైందనే చెప్పవచ్చు. ఫూల్ మఖనాలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మూ్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, బరువు తగ్గేలా చేయడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. వీటితో రకరకరాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు.
ఫూల్ మఖనాతో సులభంగా చేసుకోదగిన వంటకాల్లో ఆలూ ఫూల్ మఖన కుర్మా కూడా ఒకటి. ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేయవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఆలూ ఫూల్ మఖన కుర్మాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ ఫూల్ మఖన కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఫూల్ మఖన – ఒకటిన్నర కప్పులు, ఉడికించిన బంగాళాదుంపలు – 3, తరిగిన ఉల్లిపాయలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన పచ్చిమిర్చి – 3, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, పెరుగు – అర కప్పు, నీళ్లు – ఒక గ్లాస్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – ఒక టేబుల్ స్పూన్.
ఆలూ ఫూల్ మఖన కుర్మా తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఫూల్ మఖనాను వేసి వేయించాలి. ఇవి కొద్దిగా రంగు మారిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి. తరువాత పెరుగు వేసి నూనె పైకి తేలే వరకు కలుపుతూ వేయించాలి. తరువాత వేయించిన ఫూల్ మఖన, బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి. తరువాత పచ్చిమిర్చి, నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత కసూరి మెంతి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ఫూల్ మఖన కుర్మా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి, పుల్కా, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఫూల్ మఖనాతో కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.