Aloo Pickle : బంగాళాదుంపలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో రకరకాల కూరలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. కేవలం ఇవే కాకుండా మనం బంగాళాదుంపలతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంప పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలాగే వంటరాని వారు, మొదటి సారి చేసే వారు ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో పచ్చడిని తయారు చేసుకునే విధానాన్ని అలాగే పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన బంగాళాదుంపలు – పావు కిలో, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 10, కారం – 2 టేబుల్ స్పూన్స్, ఆవ పిండి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, మెంతి గింజలు – 10, నిమ్మకాయ – 1.
ఆలూ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కలుపుతూ రంగు మారే వరకు వేయించాలి. బంగాళాదుంప ముక్కలు ఎర్రగా కరకరలాడే వరకు వేగిన తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో కారం, ఆవపిండి, ఉప్పు, పావు టీ స్పూన్ పసపు వేసి కలపాలి. తరువాత అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు, తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలపాలి. నూనె తక్కువగా ఉండే మరికొద్దిగా నూనెను వేడి చేసి వేసి కలపాలి. ఇప్పుడు నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు.