Aloo Veg Balls : మనం బంగాళాదుంపలతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే ఈ చిరుతిళ్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అందరూ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఇష్టంగా తినేలా ఈ బంగాళాదుంపలతో మనం ఎంతో రుచిగా ఉండే వెజ్ బాల్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ వెజ్ బాల్స్ ను తయారు చేయడం చాలా తేలిక. నిమిషాల వ్యవధిలోనే వీటిని మనం తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఆలూ వెజ్ బాల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ వెజ్ బాల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 200 గ్రా., క్యారెట్ తురుము – అర కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, బియ్యం పిండి – 3 టేబుల్ స్పూన్స్, మైదా పిండి – 3 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – తగినంత.
ఆలూ వెజ్ బాల్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉడికించిన బంగాళాదుంపలను ఉండలు లేకుండా మెత్తగా చేసి వేసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లా చుట్టుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసిన తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న బాల్స్ ను తగినన్ని వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత వీటిని టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ వెజ్ బాల్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో చేసిన ఈ వెజ్ బాల్స్ సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి చాలా చక్కగా ఉంటాయి.