Alu Chana Curry : బంగాళా దుంపలను సహజంగానే చాలా మంది కూరల రూపంలో చేసుకుంటుంటారు. వీటితో వేపుడు, టమాటా కూర, కుర్మా, పులావ్, బిర్యానీ, మసాలా కర్రీ వంటివి చేయవచ్చు. ఇవన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఆలుగడ్డలతో శనగలను కలిపి మసాలా కూరను కూడా చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలు శనగల మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళదుంపలు – అర కిలో, కాబులీ శనగలు – 100 గ్రాములు, ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 4, లవంగాలు – 2, దాల్చిన చెక్క – చిన్న ముక్క, అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీస్పూన్, కారం – ఒక టీస్పూన్, కొత్తిమీర – చిన్న కట్ట, టమాటాలు – 2, నూనె – 2 టేబుల్ స్పూన్లు.
ఆలు, శనగల మసాలా కర్రీని తయారు చేసే విధానం..
శనగలు తీసుకుని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. తరువాత బంగాళాదుంపల పొట్టు తీసి ముక్కలు కోసి పెట్టుకోవాలి. అలాగే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసుకోవాలి. కొత్తిమీరను కూడా శుభ్రం చేసి సన్నగా తరగాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్రెజర్ కుక్కర్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత బంగాళా దుంప ముక్కలు, టమాటా ముక్కలు, నానబెట్టిన శనగలు వేసి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి పావు లీటర్ నీరు పోసి మూత పెట్టాలి. కుక్కర్ మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే ఆలు, శనగల మసాలా కర్రీ రెడీ అయినట్లే. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం లేదా చపాతీలు వేటితో అయినా సరే ఈ కూరను తినవచ్చు. దీన్ని అందరూ ఎంతో ఇష్టపడతారు.