Andhra Kobbari Karam Podi : ఆంధ్రా కొబ్బ‌రి కారం పొడి.. త‌యారీ ఇలా.. అన్నంలో వేడిగా తింటే రుచి అదుర్స్‌..!

Andhra Kobbari Karam Podi : మ‌నం వంటింట్లో వివిధ ర‌కాల కారం పొడుల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన కారం పొడులల్లో కొబ్బ‌రి కారం కూడా ఒక‌టి. ఎండు కొబ్బ‌రితో చేసే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. 5 నిమిషాల్లోనే ఈ కారం పొడిని త‌యారు చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ‌, వ‌డ వంటి అల్పాహారాల‌తో పాటు ఫ్రై వంట‌కాల్లో కూడా దీనిని వేసుకోవ‌చ్చు. క‌ల‌ర్ ఫుల్ గా, క‌మ్మ‌టి వాస‌న‌తో, చ‌క్క‌టి రుచితో ఉండే ఈ కొబ్బ‌రి కారం పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బ‌రి కారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన ఎండు కొబ్బ‌రి – అర చిప్ప‌, నూనె – అర టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 10 నుండి 15, క‌రివేపాకు – గుప్పెడు, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, ఉప్పు – త‌గినంత‌.

Andhra Kobbari Karam Podi recipe in telugu make in this method
Andhra Kobbari Karam Podi

కొబ్బ‌రి కారం పొడి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి. క‌రివేపాకు పూర్తిగా వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. ఇప్పుడు ఒక జార్ లో వేయించిన ఎండుమిర్చి,క‌రివేపాకు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ కారం పొడిని గిన్నెలోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి కారం పొడి త‌యార‌వుతుంది. దీనిని గాలి త‌గ‌ల‌కుండా మూత ఉండే గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. వేపుడులల్లో ఈ పొడిని వేసుకోవ‌డం వ‌ల్ల అవి మ‌రింత రుచిగా త‌యార‌వుతాయి. వంట చేసే స‌మ‌యం లేన‌ప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కారం పొడిని వేసుకుని నెయ్యితో తింటే కడుపు నిండా భోజ‌నం చేయ‌వ‌చ్చు.

D

Recent Posts