Andhra Special Majjiga Pulusu : ఆంధ్రా స్పెషల్ మజ్జిగ పులుసు.. కూరగాయలు వేసి చేసే ఈ మజ్జిగ పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా అమ్మమ్మల కాలంలో తయారు చేసేవారు. అన్నంతో తింటే ఈ మజ్జిగ పులుసు చాలా రుచిగా ఉంటుంది.ఈ మజ్జిగ పులుసు గురించి మనలో చాలా మందికి తెలియదు. కానీ మనం తరుచూ చేసే మజ్జిగ పులుసు కంటే ఈ విధంగా తయారు చేసే మజ్జిగ పులుసు మరింత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ ఆంధ్రా స్పెషల్ మజ్జిగ పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రా స్పెషల్ మజ్జిగ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 750 ఎమ్ ఎల్, తరిగిన మునక్కాడ – 1, ముల్లంగి ముక్కలు – పావు కప్పు, తరిగిన వంకాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన బెండకాయలు – 4, సొరకాయ ముక్కలు – ఒక కప్పు, తరిగిన టమాట – 1, చింతపండు – అర కప్పు, ఉప్పు,కరివేపాకు – 2 రెమ్మలు, పెరుగు – అర లీటర్, పసుపు – అర టీ స్పూన్.

మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్, శనగపప్పు – 2 టీ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, మెంతులు – ముప్పావు టీ స్పూన్, బియ్యం – ఒక టీ స్పూన్, మిరియాలు -ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, మెంతులు -అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ.
ఆంధ్రా స్పెషల్ మజ్జిగ పులుసు తయారీ విధానం..
ముందుగా మసాలా పేస్ట్ కుకావల్సిన పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని జార్ లో మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసి ఉండలు లేకుండా కలుపుకునిపక్కకు ఉంచాలి. తరువాత అడుగు మందంగా ఉండే గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే కూరగాయ ముక్కలు, చింతపండురసం, ఉప్పు వేసి ముక్కలను మెత్తగా ఉడికించాలి. కూరగాయ ముక్కలు ఉడికిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పెరుగు వేసి కలపాలి. తరువాత పసుపు వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై కలుపుతూ 10 నుండి 15 నిమిషాల పాటు చిక్కబడే వరకు ఉడికించాలి.
మజ్జిగ పులుసు ఉడుకుతుండగానే కళాయిలో తాళింపుకు నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ఉడుకుతున్న పులుసులో వేసి మూత పెట్టాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మజ్జిగ పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మజ్జిగ పులుసును తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.