Money Plant : సాధారణంగా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటే మంచి జరుగుతుందని, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని మనలో చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ విధంగా భావించి ఇంట్లో పెంచుకునే మొక్కలలో మనీ ప్లాంట్ మొక్క కూడా ఒకటి. నిజంగా ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుందా, ఐశ్వర్యం కలిసి వస్తుందా, దీనిని పెంచుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి, ఈ మొక్కను ఇంట్లో ఎక్కడ ఉంచాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అదృష్టంగా భావించి పెంచే మొక్కలలో మనీ ప్లాంట్ మొక్క కూడా ఒకటి. ఈ మొక్కను మనం చాలా సులువుగా పెంచుకోవచ్చు. మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ బయటకు పోయి ఇళ్లంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. తద్వారా మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల ధన సమృద్ది కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మనీ ప్లాంట్ మొక్క సరైన దిశలో సరైన దిక్కున పెంచకపోతే ఎంతటి అదృష్టాన్ని, ఎంతటి ధన ప్రాప్తిని కలిగిస్తుందో అంతే నస్టాన్ని కూడా కలిగిస్తుంది. మనీ ప్లాంట్ మొక్కను మన ఇంట్లో ఈశాన్య దిక్కున పెంచితే రావల్సిన ధనం రాకపోగా, ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ మొక్కను పడమర దిక్కున పెంచితే భార్యా భర్తల మనస్పర్థలు, చికాకులు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
అసలు ఈ మొక్కను ఏ దిక్కున పెంచుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు, ఏ దిక్కున పెంచుకోవడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పు, ఉత్తరం, దక్షిణ దిక్కులల్లో ఈ మొక్కను పెంచుకోవచ్చు. ఇంట్లో ఆగ్నేయం మూలన ఈ మొక్కను పెంచుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందగలం. వినాయకుడికి ఇష్టమైన ఆగ్నేయం మూలన ఈ మొక్కను పెంచుకోవడం వల్ల మనం వినాయకుడి ప్రాప్తిని పొందగలుగుతాం.
తూర్పు ఆగ్నేయంగా మనీ ప్లాంట్ మొక్కను చిన్న కుండీలో కానీ వేలాడ దీసి కానీ రోజూ నీళ్లు పోస్తూ మంచి పోషణను ఇచ్చి పెంచితే మన ఇంట్లో ధన ప్రాప్తి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క ఎప్పుడు అందంగా నిగనిగ లాడుతూ ఉండేలా చూసుకోవాలి. గుబురుగా కాకుండా పైకి ఎగబాకుతూ ఆకాశాన్ని చూస్తూ ఉండేలా ఉంచాలి. మనీ ప్లాంట్ దగ్గర ఎప్పుడు చెడుగా మాట్లాడకూడదు. మంచి విషయాలు మాత్రమే మాట్లాడాలి. పండిపోయి పసుపు రంగులోకి మారిన ఆకులను వెంటనే తొలగించాలి. ఎప్పుడూ ఈ మొక్క పచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.