Nela Vakudu Chettu : ఈ భూమి మీద ముళ్ల జాతికి చెందిన మొక్కలు కూడా ఉంటాయి. ముళ్ల జాతికి చెందిన మొక్కలలో కంటకారి మొక్క కూడా ఒకటి. దీనిని నేల ములక అని, నేల వాకుడు అని, ముళ్ల వంగ అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు నిండా ముళ్లు ఉంటాయి. ఈ మొక్కలు భూమి మీద మీటర్ పొడవు వరకు విస్తరించి పెరుగుతూ ఉంటాయి. ఈ మొక్క ఎక్కడైనా సులువుగా పెరుగుతూ ఉంటుంది. బీడు భూముల్లో, బంజరు భూముల్లో, అడవి ప్రాంతాలలో ఎక్కువగా ఈ మొక్క పెరుగుతుంది. కంటకారి మొక్క ఆకులు, కాయలు, కాండం అన్నీ ముళ్లను కలిగి ఉంటాయి. వర్షాకాలం ప్రారంభంలో చిగురించడం ప్రారంభించి నవంబర్, డిసెంబర్ నాటికి ఈ మొక్క నుండి వంకాయల్లా ఉండే కాయలు వస్తాయి. ఈ కాయలను కూరగా చేసుకుని తింటూ ఉంటారు.
ఈ మొక్కను తొలగించడం కూడా చాలా కష్టం. అనేక ముళ్లులు ప్రతిబంధకాలుగా ఉంటాయి. కనుక దీనిని దుస్పర్శ అని కూడా అంటారు. అనగా ముట్టుకోవడానికి వీలు లేదని అర్థం. ఈ చెట్టు పూలు నీలి రంగులో, ఎరుపు రంగులో ఉంటాయి. ఈ మొక్కను తాకడం కష్టమైనప్పటికీ ఇది ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతో ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే శ్వాస సంబంధమైన సమస్యలను తగ్గించడంలో ఈ మొక్క ఎంతో సహాయపడుతుంది. ఈ చెట్టు కాయలతో కూరను చేసుకుని తినడం వల్ల అధిక ప్రయోజనాలను పొందవచ్చు.
కంటకారి మొక్క వేరు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు కూడా ఈ మొక్కను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నయం చేస్తున్నారు. పేను కొరుకుడును నయం చేయడంలో నేల వాకుడు మొక్క కాయలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ మొక్క కాయలను దంచి వాటి నుండి రసాన్ని తీసి దానికి తేనెను కలిపి పేనుకొరుకుడుపై రాయడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. ఆ ప్రాంతంలో మళ్లీ కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి.
మూత్రాశయంలో రాళ్లను కరిగించే శక్తి కూడా ఈ మొక్కకు ఉంది. ఈ మొక్క సమూల చూర్ణాన్ని పూటకు ఆరు గ్రాముల చొప్పున రెండు పూటలా తీసుకోవడం వల్ల మూత్రాశయంలో రాళ్లు కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు కాయల రసాన్ని నుదుటిపై రాసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. పాము, తేలు విషాన్ని హరించే శక్తి కూడా ఈ మొక్కకు ఉంది. కంటకారి మొక్క వేరును ముద్దగా నూరి దానికి నిమ్మరసాన్ని కలిపి పాము లేదా తేలు కుట్టిన చోట ఉంచడం వల్ల విషానికి విరుగుడుగా పని చేస్తుంది.
ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి మోకాళ్ల పై ఉంచడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ మొక్క ఆకుల రసంలో దూదిని ముంచి ఆ దూదిని దంతంపై ఉంచడం వల్ల దంతం నొప్పి తగ్గుతుంది. బట్ట తలపై కూడా వెంట్రుకలను వచ్చేలా చేసే శక్తి ఈ మొక్కకు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కను వేరుతో సహా సేకరించి ముళ్లతో సహా ఈ మొక్క మొత్తాన్ని నూరి రసాన్ని తీయాలి. ఈ రసంలో నిమ్మరసాన్ని కలిపి రాయడం వల్ల బట్టతలపై కూడా వెంట్రుకలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.