Baby Corn Masala : మనం బేబికార్న్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బేబికార్న్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో ఉంటాయి. బేబికార్న్ ను తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో ఎక్కువగా స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ బేబికార్న్ తో మనం మసాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. బేబికార్న్ తో చేసే ఈ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ లలో ఎక్కువగా ఈ కర్రీ మనకు లభిస్తుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. రెస్టారెంట్ స్టైల్ బేబికార్న్ మసాలాను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. రెస్టారెంట్ స్టైల్ బేబికార్న్ మసాలాను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బేబికార్న్ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
బేబికార్న్ ముక్కలు – 200 గ్రా., నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – పావుటీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, టమాటాలు – పెద్దవి రెండు, పసుపు – పావు టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 200 ఎమ్ ఎల్, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్స్, ఫ్రెష్ క్రీమ్ – పావు కప్పు.
బేబికార్న్ మసాలా తయారీ విధానం..
ముందుగా బేబికార్న్ ముక్కలను ఉప్పు నీటిలో వేసి 70 నుండి 80 శాతం ఉడికించాలి. తరువాత వీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. ఇవి వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, గరం మసాలా, ధనియాల పొడి వేసి వేయించాలి. మసాలాలు వేగిన తరువాత టమాటాలను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి.
తరువాత పసుపు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత జీడిపప్పు పేస్ట్, నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత బేబికార్న్ వేసి ఉడికించాలి. దీనిని నూనె పైకి తేలి కూర దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర, ప్రెష్ క్రీమ్, మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బేబికార్న్ మసాలా తయారవుతుంది. దీనిని రోటీ, నాన్, బటర్ నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బేబికార్న్ మసాలాను తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.