Bachalikura Pachadi : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో బచ్చలికూర ఒకటి. ఈ ఆకుకూరతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బచ్చలికూరతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. బచ్చలికూరతో చేసుకోదగిన బచ్చలికూర పచ్చడి కూడా ఒకటి. గోంగూర వలే బచ్చలికూరతో కూడా మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం. రుచిగా, సులువుగా బచ్చలి కూరతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బచ్చలికూర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బచ్చలికూర – 4 కట్టలు, ఎండుమిర్చి – 15, ధనియాలు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతి గింజలు – 5, వెల్లుల్లి రెబ్బలు – 10, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ.
బచ్చలికూర పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. దినుసులు వేగిన తరువాత వీటిని కూడా జార్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బచ్చలికూర వేసి వేయించాలి. దీనిలో ఉండే నీరంతా పోయి ఆకు దగ్గర పడే వరకు బాగా వేయించాలి. ఇలా వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే జార్ లో వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన బచ్చలికూర, ఉప్పు, చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, కరివేపాకు, ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేసి వేయించాలి.
తరువాత కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి మూడు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బచ్చలికూర పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అందరూ ఇష్టంగా తింటారు. బచ్చలికూరతో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.