Badam Halwa : మన ఆరోగ్యానికి బాదం పప్పు ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. చాలా మంది వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. ఈ బాదం పప్పుతో మనం తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. బాదం పప్పుతో చేసే తీపి వంటకాల్లో బాదం హల్వా కూడా ఒకటి. బాదం హల్వా చాలా రుచిగా ఉంటుంది. ఈ హల్వాను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తక్కువ నెయ్యితో రుచిగా బాదం హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన బాదం పప్పు – ఒక టీ గ్లాస్, నెయ్యి – ముప్పావు టీ గ్లాస్, పాలు – 2 టీ గ్లాసులు, కుంకుమ పువ్వు – చిటికెడు, పంచదార – ఒక టీ గ్లాస్, యాలకుల పొడి – పావు టీ స్పూన్, బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూన్. తరిగిన బాదం పలుకులు – కొద్దిగా.
బాదం హల్వా తయారీ విధానం..
ముందుగా బాదం పప్పు పొట్టు తీసి ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత అందులో ఒక కప్పు పాలు పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో పాలు, కంకుమ పువ్వు, బొంబాయి రవ్వ వేసి వేడి చేయాలి. పాలు మరిగిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని చిక్కబడే వరకు కలుపుతూ ఉడికించాలి.ఇలా ఉడికించిన తరువాత యాలకుల పొడి, పంచదార వేసి కలపాలి. పంచదార కరిగి మరలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. బాదం మిశ్రమం దగ్గర పడిన తరువాత రెండు నిమిషాలకొకసారి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి.
ఇలా నెయ్యి అంతా వేసి కలిపిన తరువాత దీనిని కళాయికి అంటుకోకుండా వేరయ్యే వరకు కలుపుతూ వేయించాలి. చివరగా బాదం పలుకులను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బాదం హల్వా తయారవుతుంది. దీనిని తడి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల మూడు రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ బాదం హల్వాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పండుగులకు, స్పెషల్ డేస్ లో లేదా తీపి వంటకాలను తినాలనిపించినప్పుడు ఇలా బాదం పప్పుతో రుచిగా హల్వాను తయారు చేసుకుని తినవచ్చు.