Bappi Lahiri : భారతీయ సంగీత ప్రియులకు చేదువార్త. ఎన్నో చిత్రాల్లో తన గాత్రం, సంగీతంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహరి ఇక లేరు. ఆయన ముంబైలోని ఓ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజుల కిందట ఆయన కరోనాతో హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం కన్నుమూశారు. ఆయన మరణం ఎంతో మంది సంగీత ప్రియులను కలచి వేస్తోంది. ఆయన పాటలను తలచుకుని విచారం వ్యక్తం చేస్తున్నారు.
బప్పి లహరి అసలు పేరు అలోకేష్ లహరి. ఈయన వయస్సు 69 ఏళ్లు. భారతీయ చలన చిత్ర రంగంలో డిస్కో సంగీతాన్ని పరిచయం చేసిన వ్యక్తిగా ఈయన పేరుపొందారు. అప్పట్లో ఈయన సంగీతం అందించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కేవలం ఈయన సంగీతం కోసమే ప్రేక్షకులు సినిమా చూసేవారు అంటే అతిశయోక్తి కాదు. 1970-80లలో చల్తే చల్తే, డిస్కో డ్యాన్సర్, షరాబీ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. 2020లో శ్రద్ధా కపూర్, టైగర్ ష్రాఫ్ నటించిన బాఘి 3 చిత్రంలో ఆయన చివరి సారిగా ఒక పాట పాడారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమపై కూడా బప్పి లహరి తనదైన ముద్ర వేశారు. తెలుగులో ఈయన సంగీతం అందించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్ తదితర చిత్రాలకు బప్పి లహరి అందించిన సంగీతాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు ఆసక్తిగా వింటుంటారు. ఆయన మరణం ఎంతో మందిని కలచివేస్తోంది. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.