Beerakaya Kura : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. దీనిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. బీరకాయలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బీరకాయలను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. బరువు తగ్గడంలో కూడా బీరకాయలు మనకు ఎంతో మేలు చేస్తాయి. బీరకాయలతో మనం ఎక్కువగా పప్పు, కూర, పచ్చడి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. బీరకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
లేత బీరకాయలు – అరకిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ- 1, తరిగిన టమాట – 1, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు -తగినంత, కారం – ఒక టీ స్పూన్, కాచి చల్లార్చిన చిక్కటి పాలు – ఒక టీ గ్లాస్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బీరకాయ కర్రీ తయారీ విధానం..
ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చచేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు, బీరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి.
తరువాత దీనిపై మూత పెట్టి బీరకాయ ముక్కలను మెత్తగా ఉడికించాలి. బీరకాయ ముక్కలు పూర్తిగా మగ్గిన తరువాత కారం వేసి కలపాలి. తరువాత పాలు పోసి కలపాలి. దీనిని చిన్న మంటపై మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా బీరకాయ కూరను వండుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ కూరను లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.