Apple Cider Vinegar For Teeth : ప్రస్తుత కాలంలో నోటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఎక్కువవుతుంది. దంతాలపై పాచి పేరుకుపోవడం,దంతాలు పసుపు రంగులోకి మారిపోవడం, దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్ల ఇన్ఫెక్షన్, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం, నోటి దుర్వాసన, నాలుకపై పాచి ఎక్కువగా పేరుకుపోవడం వంటి వాటిని మనం నోటి సమస్యలుగా చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యలతో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారం వల్ల నోటిలో చెడు బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఈ చెడు బ్యాక్టీరియా నోటి ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తుంది. దీంతో మనం దంతాలకు, చిగుళ్లకు సంబంధించిన సమస్యల బారిన పడాల్సి వస్తుంది. చాలా మంది ఈ సమస్యల నుండి బయటపడడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు.
అనేక రకాల చిట్కాలను వాడుతూ ఉంటారు. కానీ ఒకే ఒక సహజ సిద్ద పదార్థాన్ని ఉపయోగించి మనం ఈ సమస్యలన్నింటి నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. నోటి సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఆపిల్ సైడ్ వెనిగర్ మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇది మనకు మెడికల్ షాపుల్లో, ఆన్ లైన్ లో విరివిరిగా లభిస్తుంది. ఆపిల్ సైడ్ వెనిగర్ ను వాడడం వల్ల దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ఆపిల్ సైడ్ వెనిగర్ 2 నుండి 3 శాతం ఆమ్లతత్వాన్ని కలిగి ఉంటుంది. దీని కారణంగా నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా నశించి నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిని వాడడం వల్ల దంతాలపై ఉండే పాచి తొలగిపోయి దంతాలు తెల్లగా మారతాయి. నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది.
చిగుళ్ల ఇన్ఫెక్షన్ లు, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం తగ్గుతుంది. దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. అయితే ఈ ఆపిల్ సైడ్ వెనిగర్ ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది తెలియక దీనిని నేరుగా నోట్లో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటారు. కొందరు బ్రష్ తో దీనిని తీసుకుని దంతాలను శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఆపిల్ సైడ్ వెనిగర్ ఆమ్లత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. కనుక దంతాలపై నేరుగా రాయడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది.
కనుక దీనిని నీటిలో వేసి కలిపి వాడాల్సి ఉంటుంది. 75 ఎమ్ ఎల్ వెచ్చటి నీటిలో ఒకటిన్నర లేదా రెండు స్పూన్ల ఆపిల్ సైడ్ వెనిగర్ ను వేసి కలిపి వాడాల్సి ఉంటుంది. నీటిలో కలపడం వల్ల ఆపిల్ సైడ్ వెనిగర్ యొక్క ఆమ్లత్వం తగ్గుతుంది. దీంతో దంతాలను నష్టం వాటిల్లకుండా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి. అలాగే బ్రష్ తో ఈ నీటిని తీసుకుని దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆపిల్ సైడ్ వెనిగర్ ను వాడడం వల్ల దంతాలు తెల్లగా మారడంతో పాటు ఆరోగ్యంగా తయారవుతాయి. నోటి ఆరోగ్యం మెరుగుపడి నోటి నుండి దుర్వాసన రావడం తగ్గుతుంది.