Beerakaya Pachadi : బీరకాయ పచ్చడి రుచిగా ఇలా చేసి చూడండి.. అన్నంలో నెయ్యితో తింటే బాగుంటుంది..!

Beerakaya Pachadi : మ‌నం కూర‌గాయ‌ల‌తో కూర‌లే కాకుండా వివిధ ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ప‌చ్చ‌ళ్లు కూడా త‌యారు చేసుకోవ‌డానికి వీలుగా ఉండే కూర‌గాయ‌ల్లో బీరకాయ‌లు కూడా ఒక‌టి. బీరకాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. బీరకాయ‌ల‌తో మ‌నం కూర‌ల‌తో పాటు ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. కింద చెప్పిన విధంగా చేసే బీరకాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇంట్లో అంద‌రూ లొట్టలేసుకుంటూ తింటారు. ఎవ‌రైనా ఈ ప‌చ్చ‌డిని చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ బీర‌కాయ ప‌చ్చ‌డి త‌యారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

బీర‌కాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాలు – అర టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు -ఒక రెమ్మ‌, నూనె- 2 టేబుల్ స్పూన్స్, ప‌చ్చిమిర్చి – 10 లేదా త‌గిన‌న్ని, త‌రిగిన బీర‌కాయ‌లు – పావు కిలో, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, త‌రిగిన ట‌మాట – 1, త‌రిగిన కొత్తిమీర – ఒక చిన్న క‌ట్ట‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 10.

Beerakaya Pachadi recipe in telugu make in this method
Beerakaya Pachadi

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

బీర‌కాయ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఇందులో ప‌ల్లీలు, ధ‌నియాలు వేసి వేయించాలి. త‌రువాత నువ్వులు, జీల‌క‌ర్ర, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, బీర‌కాయ ముక్క‌లు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ఉడికించాలి. బీర‌కాయ ముక్క‌లు స‌గానికి పైగా ఉడికిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, చింత‌పండు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ఉడికించాలి. బీరకాయ‌, ట‌మాట ముక్క‌లు పూర్తిగా మ‌గ్గిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. ఇప్పుడు జార్ లో ముందుగా వేయించిన ప‌ల్లీలు, నువ్వులు వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి.

త‌రువాత ఉడికించిన బీర‌కాయ ముక్క‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు, ఉప్పు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ప‌చ్చ‌డిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత దీనిని ప‌చ్చ‌డిలో వేసి క‌లపాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీర‌కాయ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు టిఫిన్స్ తో కూడా దీనిని తిన‌వ‌చ్చు. బీర‌కాయ‌తో ఈ విధంగా చేసిన ప‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts