Beerakaya Pallila Kura : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి. బీరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా బీరకాయలు మనకు మేలు చేస్తాయి. బీరకాయలతో చేసే వంటకాల్లో బీరకాయ కూర కూడా ఒకటి. బీరకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర రుచిగా ఉన్నప్పటికి చాలా మంది ఇష్టపడరు. అయితే కింద చెప్పిన విధంగా చేయడం వల్ల బీరకాయను ఇష్టపడని వారు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారు. పల్లీలు వేసి చేసేఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ బీరకాయ పల్లీల కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ పల్లీల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
వేయించిన పల్లీలు – పావు కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 3, కరివేపాకు – 3 రెమ్మలు, పసుపు – పావు టీ స్పూన్, ఇంగువ – 2 చిటికెలు, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన బీరకాయలు – అరకిలో, నీళ్లు – 150 ఎమ్ ఎల్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బీరకాయ పల్లీల కూర తయారీ విధానం..
ముందుగా జార్ లో పల్లీలు, కొబ్బరి ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పసుపు, ఇంగువ వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి కలపాలి. తరువాత బీరకాయ ముక్కలు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాలపాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. తరువత కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. దీనిని చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ పల్లీల కూర తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అన్నం, రోటీ, చపాతీ వంటి వాటితో తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది.