Beerakaya Tomato Pachadi : బీరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. బీరకాయలతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బీరకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాము. బీరకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని టమాటాలు వేసి మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. క్యాటరింగ్ వాళ్లు బీరకాయ పచ్చడిని ఎక్కువగా ఇలాగే తయారు చేస్తూ ఉంటారు. క్యాటరింగ్ స్టైల్ లో బీరకాయ పచ్చడిని మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బీరకాయ – ఒకటి ( పెద్దది), తరిగిన టమాటాలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు -ఒక టేబుల్ స్పూన్, మినపప్పు -ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు -ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, ఉప్పు -తగినంత, పసుపు – అర టీ స్పూన్, చింతపండు – ఒక రెమ్మ.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు -ఒక రెమ్మ, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఇంగువ – కొద్దిగా.
బీరకాయ టమాట పచ్చిడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత జీలకర్ర, పల్లీలు, ధనియాలు వేసి వేయించాలి. తరువాత నువ్వులు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత బీరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు, చింతపండు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇవి కొద్దిగా చల్లారిన తరువాత జార్ లో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే అల్పాహారాలతో కూడా దీనిని తినవచ్చు. ఈ పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.