Beetles In Rice : మనం సాధారణంగా బియ్యాన్ని నెలకు సరిపడా కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటూ ఉంటాము. అలాగే కొందరు ఆరు నెలలకు సరిపడా బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటారు. దాదాపు ప్రతి ఇంట్లో ఇలాగే చేస్తూ ఉంటారు. కేవలం బియ్యమే కాకుండా పప్పు దినుసులను, పిండి వంటి వాటిని కూడా నెలకు సరిపడా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటాము. అయితే కొన్ని సార్లు ఇలా నిల్వ చేసుకున్న బియ్యం, దినుసులు పురగు పడుతూ ఉంటాయి. పురుగులతో పాటు వాటి లార్వాలు, గుడ్లు కూడా ఉంటాయి. బియ్యం వంటి ఆహార పదార్థాల నుండి ఈ పురుగులను తొలగించడం ఒక్కోసారి కష్టమవుతుంది. ఇలా పురుగు పట్టిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం కూడా అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది.
కడుపు నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక మనం తీసుకునే ఆహార పదార్థాలు పురుగు పట్టకుండా చూసుకోవాలి. మనకు బియ్యం పురుగుపట్టకుండా అలాగే పప్పు దినుసులు వంటి పురుగు పట్టకుండా చేసే కొన్ని రకాల పొడులు లభిస్తూ ఉంటాయి. అయితే వీటి తయారీలో రసాయనాలను ఉపయోగిస్తూ ఉంటారు. కనుక వీటిని వాడకపోవడమే మంచిది. రసాయనాలు కలిపిన పొడులకు బదులుగా మనం కొన్ని రకాల చిట్కాలను వాడి సులభంగా బియ్యం, పప్పు దినుసులు వంటి వాటిని పురుగు పట్టకుండా చేయవచ్చు. పిండి, ఓట్స్, ధాన్యాలు, పప్పు దినుసులు వంటి వాటిని కొనుగోలు చేసిన తరువాత నాలుగు రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి.
ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే లార్వా, గుడ్లు నశిస్తాయి. అలాగే పిండి, బియ్యం, పప్పు దినుసులు నిల్వ చేసే డబ్బాలల్లో వేప ఆకులను ఉంచాలి. వేప ఆకులను ఉంచడం వల్ల ఆహార పదార్థాలు పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే పురుగు పట్టిన బియ్యం, పిండి వంటి వాటిలో లవంగాలను వేయాలి. లవంగాలను వేయడం వల్ల వాటి నుండి వచ్చే ఘాటు వాసనకు పురుగులు తొలగిపోతాయి. అలాగే ఆహార పదార్థాలను నిల్వ చేసే కబోర్డ్ లలో, ఆల్మారాల్లో కూడా అక్కడక్కడ లవంగాలను ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే బియ్యం నిల్వ చేసుకునే డబ్బాలో అగ్గిపెట్టెను తెరిచి ఉంచాలి.
అగ్గి పుల్లలకు ఉండే సల్ఫర్ ఆహార పదార్థాలు పురుగు పట్టకుండా చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఎక్కువ కాలం పాటు నిల్వ చేసుకునే ఆహార పదార్థాలను అప్పడప్పుడూ ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టడం వల్ల పురుగులు సులభంగా తొలగిపోతాయి. అలాగే వాటిలో ఉండే గుడ్లు, లార్వాలు కూడా నశిస్తాయి. అదే విధంగా ఆహార పదార్థాలను నిల్వ చేసుకునే డబ్బాలో వెల్లుల్లి రెబ్బలను ఉంచడం వల్ల కూడా అవి పురుగు పట్టకుండా ఉంటాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల సహజంగా ఎటువంటి రసాయానాలు వాడకుండా మనం ఆహార పదార్థాలు పురుగు పట్టకుండా చేయవచ్చు.