Coconut Papad Curry : మనలో చాలా మంది అప్పడాలను ఇష్టంగా తింటూ ఉంటారు. అప్పడాలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువగా పప్పు, సాంబార్ వంటి కూరలతో వీటిని సైడ్ డిష్ గా తింటూ ఉంటారు. అలాగే మన ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ లో కూడా అప్పడాలు తప్పకుండా ఉంటాయి. సైడ్ డిష్ గా తినడంతో పాటు ఈ అప్పడాలతో మనం ఎంతో రుచిగా ఉండే కర్రీని కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి తురుము వేసి చేసే ఈ అప్పడాల కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే కొకోనట్ పాపడ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొకోనట్ పాపడ్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అప్పడాలు – 10 నుండి 12, నూనె- ముప్పావు కప్పు, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 4, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 5, తరిగిన మునక్కాయ ముక్కలు – 3, ఉప్పు -తగినంత, పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు, కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు, గరం మసాలా – ఒక టీ స్పూన్.
కొకోనట్ పాపడ్ కర్రీ తయారీ విధానం..
ముందుగా అప్పడాలను వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉప్పు, మునక్కాయ ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మునక్కాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. మునక్కాయ ముక్కలు పూర్తిగా మగ్గిన తరువాత అప్పడాలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. వీటిని గంటె పెట్టి కదపకుండా కళాయిని కదుపుతూ అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత కొబ్బరి తురుమును కూడా వేసి కళాయిని కదుపుతూ అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత పాలను పోయాలి. చివరగా గరం మసాలా వేసి నెమ్మదిగా అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొకోనట్ పాపడ్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. వెరైటీ వంటకాలను తినాలని కోరుకునే వారు ఇలా అప్పడాలతో రుచిగా కర్రీని తయారు చేసుకుని తినవచ్చు.