Bellam Gummadi Kaya Kura : మనం ఆహారంగా గుమ్మడికాయను కూడా తీసుకుంటూ ఉంటాం. దీనిని చాలా తక్కువగా తింటూ ఉంటాం. అంతేకాకుండా ఈ గుమ్మడికాయను తినే వారు కూడా చాలా తక్కువగా ఉంటారు. ఇతర కూరగాయల లాగా దీనిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దీనిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడానికి ఉపయోగపడే విటమిన్ ఎ దీనిలో పుష్కలంగా ఉంటుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో గుమ్మడికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. గుమ్మడికాయతో వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటారు. చాలా మంది గుమ్మడి కాయను, బెల్లాన్ని కలిపి కూరగా చేసుకొని తింటుంటారు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభమే. బెల్లాన్ని, గుమ్మడికాయను కలిపి కూరను ఏవిధంగా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం గుమ్మడికాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
గుమ్మడికాయ – ఒక కిలో, బెల్లం తురుము – అర కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండు మిర్చి – 3, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, కారం – 2 చిటికెలు, ఉప్పు – అర టీ స్పూన్.
బెల్లం గుమ్మడికాయ కూర తయారీ విధానం..
ముందుగా గుమ్మడి కాయను ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి నూనె కాగిన తరువాత ఎడు మిర్చిని, జీలకర్రను, ఆవాలను, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత గుమ్మడి కాయ ముక్కలను, ఉప్పును, కారాన్ని వేసి కలిపి మూత పెట్టి చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత ఈ ముక్కలపై బెల్లం తురుమును వేసి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత మూత తీసి గుమ్మడి కాయ ముక్కలు, బెల్లం కలిసేలా బాగా కలిపి మరలా మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఇప్పుడు మూత తీసి కలపాలి. మళ్లీ మూత పెట్టకుండా మధ్యస్థ మంటపై గుమ్మడి కాయ ముక్కలు పూర్తిగా ఉడికి దగ్గర పడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం గుమ్మడి కాయ కూర తయారవుతుంది. దీనిని నేరుగా లేదా చపాతీ, పూరీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర వండేటప్పుడు గుమ్మడికాయ పై ఉండే పొట్టును తీయకూడదు. ఈ విధంగా బెల్లం గుమ్మడి కాయ కూరను తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.