Bellam Ravva Laddu : మనం బొంబాయిరవ్వతో వివిధ రకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసుకోదగిన తీపి వంటకాల్లో రవ్వ లడ్డూలు కూడా ఒకటి. రవ్వ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధారణంగా ఈ రవ్వ లడ్డూలను మనం పంచదారతో తయారు చేస్తూ ఉంటాము. పంచదారకి బదులుగా బెల్లంతో కూడా ఈ రవ్వ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసేలా ఈ రవ్వ లడ్డూలను మనం తయారు చేసుకోవచ్చు. బెల్లంతో కూడా రవ్వ లడ్డూలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ రవ్వ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పలుకులు – కొద్దిగా, బాదంపప్పు – కొద్దిగా, ఎండుద్రాక్ష – కొద్దిగా, బొంబాయి రవ్వ – ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము – ఒక కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నీళ్లు – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
రవ్వ లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో రవ్వ వేసి వేయించాలి. దీనిని చిన్న మంటపై కలుపుతూ 6 నుండి 7 నిమిషాల పాటు వేయించిన తరువాత పచ్చికొబ్బరి తురుము వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు వేయించిన తరువాత గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగే వరకు దీనిని కలుపుతూ వేడి చేయాలి.
బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టి ముందుగా వేయించిన రవ్వలో వేసి కలపాలి. తరువాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకుని లడ్డూలుగా చట్టుకోవాలి. ఈ మిశ్రమం లడ్డూలుగా చుట్టడానికి రాకపోతే కాచి చల్లార్చిన పాలని లేదా నెయ్యిని వేసుకుని లడ్డూలను చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ లడ్డూలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా రవ్వతో రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు.