Bendakaya Pulusu : మనం బెండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. బెండకాయలతో ఎక్కువగా వేపుడు, కూర, పులుసు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. బెండకాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ పులుసును తయారు చేయడం కూడా చాలా సులభం. అందరికి నచ్చేలా మరింత రుచిగా బెండకాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు -ఒక టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 4, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, పసుపు – పావు టీ స్పూన్, పెద్ద ముక్కలుగా తరిగిన లేత బెండకాయలు – అరకిలో, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, బెల్లం తురుము – 3 టేబుల్ స్పూన్స్, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్.
బెండకాయ పులుసు తయారీ విధానం..
ముందుగా నానబెట్టిన చింతపండు నుండి 400 ఎమ్ ఎల్ చింతపండు రసాన్ని తీసుకోవాలి. తరువాత శనగపిండిలో అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు వేసి వేయించాలి. తరువాత బెండకాయ ముక్కలు వేసి 4 నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించాలి. తరువాత చింతపండు రసం, ఉప్పు, బెల్లం తురుము వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి చిన్న మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత శనగపిండి మిశ్రమం వేసి కలపాలి. తరువాత మరలా మూత పెట్టి మరో 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ బెండకాయ పులుసును లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.