Bendakaya Vellulli Karam Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలల్లో బెండకాయలు కూడా ఒకటి. ఇతర కూరగాయల లాగా ఇవి కూడా ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. బెండకాయలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ సాఫీగా సాగుతుంది. షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది.
బరువు తగ్గడంలో బెండకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ బెండకాయలు జిగురుగా ఉంటాయనే ఒకే ఒక్క కారణం చేత వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. వీటిని కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక బెండకాయలను తినలేని వారు కింద చెప్పిన విధంగా బెండకాయలలో వెల్లుల్లి కారాన్ని వేసి ఫ్రై చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. బెండకాయల వెల్లుల్లి కారం ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయల వెల్లుల్లి కారం ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బెండకాయలు – పావు కిలో, శనగ పప్పు – 2 టేబుల్ స్పూన్స్. ధనియాలు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 8 లేదా 10, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10 లేదా 12, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్.
బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో శనగ పప్పు, ధనియాలు, ఎండు మిర్చిని ఒక దాని తరువాత ఒకటి వేసి రంగు మారే వరకు వేయించి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇవి చల్లగా అయిన తరువాత ఒక జార్ లో వేయాలి. వీటితోపాటు వెల్లుల్లి రెబ్బలు, ఉప్పును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయలను శుభ్రంగా కడిగి 2 ఇంచుల పొడవు ఉండేలా ముక్కలుగా చేసుకోవాలి. కళాయిలో నూనె వేసి కాగిన తరువాత తరిగిన బెండకాయ ముక్కలను వేసి కలుపుతూ బెండకాయలు పూర్తిగా వేగే వరకు వేయించాలి.
బెండకాయలు పూర్తిగా వేగిన తరువాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే బెండకాయ ఫ్రై కి బదులుగా ఇలా వెల్లుల్లి కారాన్ని వేసి చేసే ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా బెండకాయలను, వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.