Bhindi Egg Fry : బెండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెండకాయ కూర, పులుసు, వేపుడు ఇలా అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఈ వంటకాలు అందరూ చేసేవే. కానీ మీరెప్పుడైన బెండకాయ కోడిగుడ్డు ఫ్రై ను చేసారా. బెండకాయలు, కోడిగుడ్డు కలిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. కొత్త వంటకాలు రుచి చూడాలనుకునే వారు ఈ ఫ్రై ను తప్పకుండా రుచి చూడాల్సిందే. ఈ ఫ్రైను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే బెండకాయ కోడిగుడ్డు ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ కోడిగుడ్డు ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన బెండకాయలు – పావుకిలో, ఆవాలు -అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన ఉల్లిపాయలు – 2, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు -తగినంత, తరిగిన టమాటాలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కోడిగుడ్లు -3, పసుపు – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, గరం మసాలా – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్స్.
బెండకాయ కోడిగుడ్డు ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలను వేసి వేయించాలి. వీటిని పెద్ద మంటపై సగానికి పైగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత కోడిగుడ్లను వేసుకోవాలి. తరువాత మూత పెట్టి కోడిగుడ్డును ఉడికించాలి. కోడిగుడ్డు ఉడికిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తరువాత వీటిని బాగా వేయించిన తరువాత బెండకాయ ముక్కలను వేసి కలపాలి. తరువాత ఈ ముక్కలను పూర్తిగా వేయించాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి. చివరగా కొబ్బరి తురుమును వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ కోడిగుడ్డు ఫ్రై తయారవుతుంది.దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో మిరియాల పొడికి బదులుగా కారాన్ని కూడా వేసుకోవచ్చు. బెండకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా వెరైటీగా కూడా చేసుకుని తినవచ్చు.