Bhindi Kurkure : బెండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బెండకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. తరచూ చేసే బెండకాయ కూరలతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే కుర్ కురేలను కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయలతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. పప్పు, సాంబార్ వంటి వాటితో తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే ఈ బెండకాయ కుర్ కురేలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ కుర్ కురే తయారీకి కావల్సిన పదార్తాలు..
బెండకాయలు – పావుకిలో, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్ లేదా తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క.
బెండకాయ కుర్ కురే తయారీ విధానం..
ముందుగా బెండకాయల్లో ఉండే గింజలను తీసేసి వాటిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ ముక్కలల్లో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి పిండి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా బెండకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ కుర్ కురే తయారవుతుంది. దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. బెండకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కుర్ కురేలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.