Bhindi Sambar : బెండ‌కాయ‌ల‌తో సాంబార్‌ను ఇలా ఎప్పుడైనా చేశారా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Bhindi Sambar : మ‌నం బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెండ‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా పులుసు, వేపుడు, కూర వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా బెండ‌కాయ‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే సాంబార్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెండ‌కాయ సాంబార్ చాలారుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. లొట్ట‌లేసుకుంటూ తినేంత రుచిగా ఉండే ఈ బెండ‌కాయ సాంబార్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బెండ‌కాయ సాంబార్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన కందిప‌ప్పు – ఒక క‌ప్పు, నీళ్లు – మూడున్న‌ర క‌ప్పులు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, అంగుళం పొడ‌వుతో త‌రిగిన బెండ‌కాయ‌లు – పావు కిలో, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ప‌సుపు – పావు టీ స్పూన్, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ట‌మాట – 1, నానబెట్టిన చింత‌పండు – 50 గ్రా., కారం – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి -ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, సాంబార్ పొడి – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, బెల్లం – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Bhindi Sambar recipe in telugu very tasty with rice
Bhindi Sambar

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె -ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు -ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఇంగువ – రెండు చిటికెలు.

బెండ‌కాయ సాంబార్ త‌యారీ విధానం..

ముందుగా కందిప‌ప్పును కుక్క‌ర్ లో వేసి నీళ్లు పోయాలి. త‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బెండ‌కాయ ముక్క‌ల‌ను వేసి పెద్ద మంట‌పై వేయించాలి. త‌రువాత మ‌రో క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాచ ముక్క‌లు. ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ప‌సుపు, ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత బెండ‌కాయ ముక్క‌లు వేసి మూత పెట్టి మ‌రో 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత చింత‌పండు నుండి 200 ఎమ్ ఎల్ చింత‌పండు ర‌సాన్ని తీసి వేయాలి. త‌రువాత ఉప్పు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత ప‌ప్పు, మ‌రో 150 ఎమ్ ఎల్ నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు సాంబార్ ను బాగా ఉడికించాలి.

సాంబార్ చ‌క్క‌గా మ‌రిగిన త‌రువాత బెల్లం, క‌రివేపాకు వేసి మూత పెట్టి చిన్న మంట‌పై సాంబార్ ను మ‌రిగిస్తూనే ఉండాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత ఈ తాళింపును సాంబార్ లో వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి మ‌రో 3 నిమిషాల పాటు సాంబార్ ను మ‌రిగించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ సాంబార్ త‌యారవుతుంది. దీనిని అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా తిన‌వ‌చ్చు. ఈ సాంబార్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. బెండ‌కాయ‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా సాంబార్ ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts