Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రేక్షకులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీజన్ ఆరంభంలో పెద్దగా రేటింగ్స్ రాలేదు. కానీ షోలో మార్పులు చేశాక.. అదిరిపోయే రేటింగ్స్ వచ్చాయి. అలాగే షో ముగింపు దశకు చేరుకున్నాక సిరి, షణ్ముఖ్‌ల రొమాన్స్.. పింకీ, మానస్‌ల లవ్ ట్రాక్.. వంటివన్నీ షోకు కలసి వచ్చాయి. దీంతో సహజంగానే ఈ షోను చూడడం మొదలు పెట్టారు. అయితే సీజన్ 5 ఫినాలె సందర్బంగా నాగార్జున బిగ్ బాస్ ఓటీటీ కూడా వస్తుందని ప్రకటించారు. దీంతో ఆ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడడం మొదలు పెట్టారు. ఇక వారి నిరీక్షణకు తెర పడనుందని చెప్పవచ్చు.
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షోకు ఇప్పటికే బిగ్ బాస్ నాన్ స్టాప్ అని నిర్వాహకులు పేరు పెట్టారు. ఈ షో ఈ నెల 26వ తేదీన ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీంతో తాజాగా నిర్వాహకులు మళ్లీ అప్‌డేట్ ఇచ్చారు. షోకు చెందిన ప్రోమోను వారు లాంచ్ చేశారు. అతి త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానుందని చెప్పారు. దీంతో మరో వారం లేదా పది రోజుల్లో ఈ షో ప్రారంభం కానుందని తెలుస్తోంది.
బిగ్ బాస్ ఓటీటీ షోకు గాను ఇప్పటికే కంటెస్టెంట్లను ఎంపిక చేసి క్వారంటైన్‌కు తరలించినట్లు తెలిసింది. గత సీజన్లలో పార్టిసిపేట్ చేసిన తేజస్వి మడివాడ, ముమైత్ ఖాన్‌లు ఈ సారి ఓటీటీ షోలో పాల్గొనబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ షోను 6 వారాల పాటు ప్రసారం చేస్తారని, రూ.25 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారని తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ యాప్ లోనే ఈ షో ప్రసారం అవుతుంది. దీన్ని రోజుకు 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ షోపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.