Biyyam Payasam : మనం వంటింట్లో అప్పుడప్పుడూ పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాం. పాయాసాన్ని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. పాయసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పాయసం రుచిగా ఉండడంతో పాటు దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే బియ్యం పెసరపప్పు పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక టీ గ్లాస్, పెసరపప్పు – ఒక టీ గ్లాస్ లో ముప్పావు వంతు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, నీళ్లు – 7 టీ గ్లాసులు, పాలు – 6 టీ గ్లాసులు, బెల్లం తరుగు – 3 టీ గ్లాసులు,యాలకుల పొడి – అర టీ స్పూన్.
బియ్యం పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని, పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత వీటిని నీరు లేకుండా వడకట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కుక్కర్ లో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కుక్కర్ లో కడిగిన బియ్యం, పెసరపప్పు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఇందులో నీళ్లు పోసి మూత పెట్టాలి. వీటిని మధ్యస్థ మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో పాలు పోసి కలపాలి. దీనిని మరో 10 నిమిషాల పాటు ఉడికించాలి. పాయసం ఉడుకుతుండగానే మరో గిన్నెలో బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు వేడి చేయాలి.
తరువాత దీనిని వడకట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. పాయసాన్ని పది నిమిషాల పాటు ఉడికించిన తరువాత బెల్లం నీటిని పోసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు ఉడికించిన తరువాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యం పాయసం తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా బియ్యం పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తినడం వల్ల శరీరానికి కూడా మేలు కలుగుతుంది.