Biyyam Vadiyalu : ఎండాకాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది వడియాలను పెడుతూ ఉంటారు. సంవత్సరానికి సరిపడా వడియాలను ఒకేసారి తయారు చేసుకుని నిల్వ చేసుకుంటూ ఉంటారు. సైడ్ డిష్ గా తినడానికి వడియాలు చాలాచక్కగా ఉంటాయి. మనం రకరకాల వడియాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో బియ్యం వడియాలు కూడా ఒకటి. బియ్యం వడియాలను సరైన పద్దతిలో చేయాలే కానీ గుల్ల గుల్లగా చాలా చక్కగా ఉంటాయి. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా బియ్యం వడియాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం వడియాల తయారీకి కావల్సిన పదార్థాలు..
రేషన్ బియ్యం – ఒక కప్పు, సగ్గు బియ్యం -పావు కప్పు, నీళ్లు – 5 కప్పులు, ఉప్పు – తగినంత, పచ్చిమిర్చి – 2, అల్లం – అర అంగుళం, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బియ్యం వడియాల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బియ్యాన్ని, సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. తరువాత వీటిని రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి ఒక కప్పు నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఉప్పు, మిక్సీ పట్టుకున్న బియ్యం మిశ్రమం వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా 4 నిమిషాల పాటు ఉడికించిన తరువాత జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి దంచి వేసుకోవాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మూత పెట్టిచిన్న మంటపై మరో 4 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మురుకుల గొట్టంలోకి తీసుకోవాలి లేదా పైపింగ్ బ్యాగ్ లోకి తీసుకోవాలి. తరువాత కాటన్ వస్త్రంపై లేదా ప్లాస్టిక్ కవర్ పై మనకు నచ్చిన ఆకారంలో వడియాలు పెట్టుకోవాలి. తరువాత వీటిని ఎండలో బాగా ఎండబెట్టాలి. వడియాలు చక్కగా ఎండిన తరువాత గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బియ్యం వడియాలు తయారవుతాయి. వీటిని వేయించడానికి గానూ ముందుగా కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వడియాలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని పప్పు, రసం, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా చక్కగా ఉంటాయి.